
వేసవి కాలం ప్రారంభం కావడంతో మార్కెట్లో పుచ్చకాయలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. శరీరంలోని నీటి శాతాన్ని నియంత్రించడంలో ఎండ దెబ్బ నుండి కాపాడటంలో పుచ్చకాయ కీలక పాత్ర పోషిస్తుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీనిని ఇష్టంగా తింటారు. అయితే పుచ్చకాయ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, దానిని తీసుకునే పద్ధతి సరిగ్గా లేకపోతే కడుపు నొప్పి, ఉబ్బరం అజీర్ణం వంటి సమస్యలు ఎదురవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పుచ్చకాయ నుండి పూర్తి పోషకాలు అందాలంటే మనం కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించడం తప్పనిసరి.
రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేస్తే..
చాలామంది పుచ్చకాయను చల్లగా తినాలనే ఉద్దేశంతో ఫ్రిజ్‌లో ఉంచుతారు. కానీ రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల పుచ్చకాయలోని సహజ గుణాలు మారిపోతాయి. అతిగా చల్లబడిన పుచ్చకాయను తినడం జీర్ణక్రియకు హానికరం. మీకు చల్లటి పుచ్చకాయ తినాలనిపిస్తే, దానిని ఫ్రిజ్‌లో పెట్టడానికి బదులుగా, తినడానికి 3 నుండి 4 గంటల ముందు ఒక బకెట్ చల్లటి నీటిలో ఉంచండి. ఇలా చేయడం వల్ల పండు సహజంగా చల్లబడటమే కాకుండా అందులోని పోషక విలువలు కూడా అలాగే ఉంటాయి.
పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా?
పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగడం అనేది అందరూ చేసే అతిపెద్ద పొరపాటు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ తప్పు ఎక్కువగా చేస్తుంటారు. పుచ్చకాయలో ఇప్పటికే 90 శాతం వరకు నీరు ఉంటుంది. దానిపై మళ్ళీ అదనంగా నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడుతుంది. దీని ఫలితంగా విరేచనాలు, వాంతులు లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి పుచ్చకాయ తిన్న తర్వాత కనీసం 45 నిమిషాల వరకు నీళ్లు తాగకుండా ఉండటం మంచిది.
ఎంత పరిమాణంలో తినాలి?
పుచ్చకాయ ఆరోగ్యానికి మంచిదని అతిగా తినడం కూడా శ్రేయస్కరం కాదు. ఒక సాధారణ వ్యక్తి ఒక ప్లేటు లేదా 2 నుండి 3 పెద్ద ముక్కలు తినడం సరిపోతుంది. ఒక మధ్యస్థ పరిమాణపు పుచ్చకాయను కుటుంబంలో ముగ్గురు లేదా నలుగురు పంచుకుని తినడం ఉత్తమం. మితంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు.
ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన పండును సరైన పద్ధతిలో తీసుకున్నప్పుడే మనకు పూర్తి ఆరోగ్యం లభిస్తుంది. ముఖ్యంగా వేసవిలో పండ్లను తాజాగా ఉన్నప్పుడే తినడానికి ప్రయత్నించండి.
గమనిక: ఈ సమాచారం ఆరోగ్య నిపుణుల అభిప్రాయాలు వైద్య నివేదికల ఆధారంగా రూపొందించబడింది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా జీర్ణ సంబంధిత సమస్యలు లేదా అలర్జీలు ఉంటే, మీ ఆహారంలో మార్పులు చేసే ముందు వైద్యుడిని సంప్రదించడం శ్రేయస్కరం.