Reading Time: < 1 minute

హైదరాబాద్‌ లో దంచికొట్టిన వాన.. చెరువులను తలపిస్తున్న రోడ్లు..గంటలోనే 8 సెం.మీ రికార్డు వర్షపాతం

Caption of Image.

 హైదరాబాద్ సిటీ ఒక్కసారిగా దంచికొట్టిన వర్షంతో అతలాకుతలమైంది. కేవలం గంట వ్యవధిలోనే నగరవ్యాప్తంగా రికార్డు స్థాయిలో భారీ వర్షపాతం నమోదైంది. తక్కువ సమయంలోనే కొండపోతగా కురిసిన వానతో… నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి.

రోడ్లపై మోకాళ్లోతు నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు నరకం చూస్తున్నారు. డ్రైనేజీలు పొంగిపొర్లి వరద నీరు రోడ్లపైకి చేరింది. పలు అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల సెల్లార్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అటు.. వానకు తోడు ఈదురుగాలుల తీవ్రతకు నగరంలో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. నగరంలో గంటలోనే అత్యధికంగా 8 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది.

నగరవ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు చూస్తే… అత్యధికంగా ముషీరాబాద్, బన్సీలాల్ పేటలో 8.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హిమాయత్ నగర్, GHMC ఆఫీస్ పరిసరాల్లో 7.8 సెంటీమీటర్లు… లిబర్టీలో 6.4, మెట్టుగూడలో 5.7, అడిక్‌మెట్‌లో 5.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ఆసిఫ్ నగర్, నాంపల్లిలో 5.5… షేర్లింగంపల్లి, మియాపూర్‌లలో 5.3 సెంటీమీటర్ల వాన పడింది. ఉస్మానియా యూనివర్సిటీ, కూకట్‌పల్లి, బాలాజీ నగర్, సికింద్రాబాద్ పరిసరాల్లో 5 సెంటీమీటర్ల వర్షం కురవగా… చిలకలగూడ, సీతాఫల్‌మండి, మారేడుపల్లి, అంబర్‌పేట్, షేక్‌పేట్, మల్కాజిగిరి, ఖాజాగూడ ప్రాంతాల్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

►ALSO READ | హైదరాబాద్ సిటీ మొత్తం వర్షం : ఆఫీసుల నుంచి వెళ్లే టైంలో ట్రాఫిక్ పరేషాన్

ఇక సచివాలయం, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కింద రోడ్డు పూర్తిగా జలమయమైంది. బషీర్ బాగ్, హైదర్‌గూడ రోడ్లయితే ఏకంగా చెరువులను తలపిస్తున్నాయి. ట్యాంక్ బండ్ పై భారీ వృక్షం కూలిపోవడంతో.. ట్యాంక్ బండ్ నుంచి సెక్రటేరియట్ వరకు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ పైన వాహనాలు నత్తనడకన సాగుతున్నాయి.

సరిగ్గా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయానికే వాన దంచికొట్టడంతో… ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి ట్రాఫిక్‌లోనే నరకయాతన అనుభవిస్తున్నారు. రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ (DRF) సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు… రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు, కూలిన చెట్లను తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.