
సాధారణంగా ప్రోటీన్ అనగానే మనకు మొదట గుర్తొచ్చేది కోడి గుడ్డు. ఒక గుడ్డులో సుమారు 6 నుండి 7 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్ ఉంటుంది. వీటితో పాటు విటమిన్ A, B2, B6, B12, D, E వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు, రిబోఫ్లావిన్, కోలిన్, లుటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందులో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగ పడుతాయి. అయితే, మార్కెట్లో మనకు తెల్లటి గుడ్లతో పాటు గోధుమ రంగు గుడ్లు కూడా దొరుకుతాయి. వీటిలో ఏది ఆరోగ్యానికి మంచిదనే సందేహం చాలా మందిలో ఉంటుంది. గోధుమ రంగు గుడ్లు ధర ఎక్కువగా ఉండటంతో, అవి ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయని చాలా మంది భావిస్తారు. అసలు నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిపుణులు ఏమంటున్నారు?
మహారాష్ట్రకు చెందిన ఆహార నిపుణురాలు అల్కా కర్ణిక్ ప్రకారం, తెల్లటి గుడ్డుకు, గోధుమ రంగు గుడ్డుకు మధ్య పోషక విలువల పరంగా పెద్దగా తేడా లేదని చెబుతున్నారు. గుడ్డు రంగు అనేది కేవలం ఆ కోడి జాతి మీద ఆధారపడి ఉంటుందని. తెల్ల ఈకలు ఉన్న కోళ్లు తెల్ల గుడ్లను, ముదురు రంగు ఈకలు ఉన్న కోళ్లు గోధుమ రంగు గుడ్లను పెడతాయని చెబుతున్నారు.
ధర ఎందుకు ఎక్కువ?
గోధుమ రంగు గుడ్లు పెట్టే కోళ్లు పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. వాటికి ఆహారం కూడా ఎక్కువ కావాలి. అలాగే వీటి ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల వీటి ధర కూడా ఎక్కువగా ఉంటుంది తప్ప, పోషకాలు ఎక్కువగా ఉన్నందున కాదని నిపుణులు అంటున్నారు. గుడ్డు పరిమాణం కోడి వయస్సు, సైజుపై ఆధారపడి ఉంటుంది కానీ.. రంగుపై కాదంటున్నారు.
మనం గుడ్డును కొనే ముందు దాని రంగు కంటే అది ఎంత తాజాగా ఉంది అనేది తెలుసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. రంగు ఏదైనా సరే, తాజా గుడ్లను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, శక్తి అందుతాయంటున్నారు. కాబట్టి ఇకపై తెల్ల గుడ్డు కొనాలా లేక గోధుమ రంగు గుడ్డు కొనాలా అని తికమక పడకుండా మీకు నచ్చిన, తాజా గుడ్లను నిరభ్యంతరంగా మీ ఆహారంలో చేర్చుకోండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.