Reading Time: 2 minutes

దావూద్ లేకపోతే నేను లేను.. అండర్ వరల్డ్ మాఫియాపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు!

Caption of Image.

బాలీవుడ్ చిత్ర పరిశ్రమ 1990వ దశకంలో ఎక్కువగా అండర్ వరల్డ్ మాఫియా గుప్పిట్లో నలిగిపోయేది. నాడు ముంబై గ్యాంగ్‌స్టర్ల ప్రభావం ఎంతలా  ఉండేదంటే.. ఏ సినిమా విడుదల కావాలన్నా, ఏ నటుడు ఎక్కడ నటించాలన్నా దావూద్ ఇబ్రహీం , అబూ సలేం వంటి గ్యాంగ్‌స్టర్ల కనుసన్నల్లోనే జరగాల్సి వచ్చేది. వారి బెదిరింపులకు నటులు , దర్శకులు, నిర్మాతలు ప్రాణభయంతో వణికిపోయేవారు. అయితే, అప్పట్లో గ్యాంగ్‌స్టర్ కథలతో సంచలనం సృష్టించిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మాత్రం లేటెస్ట్ గా దీనికి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

గ్యాంగ్‌స్టర్లే నా జీవనోపాధి..

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  లేటెస్ట్ గా  ఓ ఇంటర్వ్యూలో  గ్యాంగ్‌స్టర్ల పై కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన ఆత్మకథ ‘గన్స్ అండ్ థైస్’ (Guns & Thighs) గురించి చెబుతూ.. “నేను ఈ పుస్తకాన్ని దావూద్ ఇబ్రహీంకు అంకితం ఇచ్చాను. కానీ ప్రచురణకర్తలు భయపడి అతని పేరును తొలగించారు. నిజానికి దావూద్ ఇబ్రహీం అనే వ్యక్తి లేకపోతే నేను ‘సత్య’, ‘కంపెనీ’ వంటి ఐకానిక్ చిత్రాలను తీసేవాడిని కాదు. నా జీవనోపాధికి వాళ్లే కారణమైనప్పుడు, ఆ పుస్తకాన్ని అతనికి అంకితం ఇవ్వడంలో తప్పేంటి?” అని ఆర్జీవీ ప్రశ్నించారు.

బెదిరింపు కాల్స్ లేని ఏకైక దర్శకుడు!

అంతేకాకుండా, అప్పట్లో అందరికీ బెదిరింపు కాల్స్ వచ్చేవి. అగ్ర హీరోలు, నిర్మాతలు అండర్ వరల్డ్ ఫోన్ కాల్స్ వస్తే వణికిపోయేవారు. కానీ, తనకు మాత్రం ఒక్కటి కూడా రాలేదని ఆయన చెప్పుకొచ్చారు. గ్యాంగ్‌స్టర్లకు సత్య, కంపెనీ సినిమాలు బాగా నచ్చాయి. వాళ్లు నన్ను తమ ఆత్మీయుడుగా భావించేవారు. అందుకే నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు అని వర్మ చెప్పుకొచ్చారు.

మాఫియా సొమ్ముతోనే సినిమాలు?

ఆర్జీవీ వ్యాఖ్యలు ఇలా ఉంటే.. మరోవైపు ముంబై మాజీ జాయింట్ సీపీ (క్రైమ్) డి. శివానందన్ వర్మ సినిమాలపై గతంలోనే తీవ్ర ఆరోపణలు చేశారు. ‘సత్య’, ‘కంపెనీ’, ‘షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా’ వంటి చిత్రాలు కేవలం గ్యాంగ్‌స్టర్ల ఇమేజ్‌ను పెంచడానికి తీసినవని, వీటికి మాఫియా నుండే ఫండింగ్ అందేదని ఆయన పేర్కొన్నారు. కేవలం ఇవే కాదు, 70వ దశకంలో వచ్చిన ‘దీవార్’, ‘ముకద్దర్ కా సికందర్’ వంటి చిత్రాలకు కూడా అండర్ వరల్డ్ పెట్టుబడులు ఉండేవని ఆయన సంచలన  వ్యాఖ్యలు చేశారు.

వణికించిన మారణకాండ..

90వ దశకంలో అండర్‌వరల్డ్ డిమాండ్లకు తలొగ్గని వారిని మాఫియా కనికరం లేకుండా హతమార్చేది.  టీ-సిరీస్ అధినేత గుల్షన్ కుమార్‌ను పట్టపగలే కాల్చి చంపడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన తొలి సినిమా ‘కుచ్ కుచ్ హోతా హై’ విడుదల సమయంలో తనకు అండర్‌వరల్డ్ నుండి బెదిరింపు కాల్స్ వచ్చాయని కరణ్ జోహార్ తన బయోగ్రఫీలో రాసుకున్నారు. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉండటంతో విదేశాలకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేసుకున్నారు.  సీనియర్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ కూడా మాఫియా కాల్స్ ఎదుర్కొన్నారు.  ‘కహో నా ప్యార్ హై’ సక్సెస్ తర్వాత ప్రాపర్టీ వాటా ఇవ్వలేదన్న కారణంతో రాకేశ్ రోషన్‌పై కూడా కాల్పులు జరిగాయి.

పోలీసులు ఏమీ చేయలేకపోయారా?

అప్పట్లో పోలీసులు ఎందుకు రక్షణ కల్పించలేకపోయారన్న ప్రశ్నకు శివానందన్ సమాధానమిచ్చారు. మా వద్ద పరిమిత వనరులు ఉండేవి. నటీనటులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించే సామర్థ్యం అప్పట్లో లేదు. అందుకే సెలబ్రిటీలు వేరే దారి లేక మాఫియా చెప్పినట్లు వినాల్సి వచ్చేది. మేము కూడా వారిపై చర్యలు తీసుకోలేకపోయేవాళ్ళం అని ఆయన అంగీకరించారు.  ఏది ఏమైనా, 90ల నాటి పరిస్థితులు ఇండియన్ సినిమా చరిత్రలో ఒక మరకగా మిగిలిపోయింది.. రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకులు ఆ చీకటి ప్రపంచాన్ని వెండితెరపై ఆవిష్కరించి హిట్లు కొట్టినప్పటికీ, ఆ క్రెడిట్ అంతా అండర్‌వరల్డ్ డాన్లకే ఇవ్వడం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది…

 

©️ VIL Media Pvt Ltd.