July 10, 2026

Mr work From Home: ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ వినూత్న ప్రమోషన్స్‌.. రైతుల మధ్య నుంచే ప్రచారం ప్రారంభం!

Mr work From Home: ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ వినూత్న ప్రమోషన్స్‌.. రైతుల మధ్య నుంచే ప్రచారం ప్రారంభం!
Reading Time: 2 minutes
Mr Work From Home Movie Promotions Unique Campaign Among Farmers Gains Attention

Mr Work From Home Movie Unique Campaign: ఈ రోజుల్లో ఒక సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, ఆ సినిమాను ప్రేక్షకులకు చేరేలా ప్రమోట్ చేయడం మరింత పెద్ద సవాలుగా మారింది. భారీ బడ్జెట్ సినిమాలు అయితే కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తాయి. కానీ సమాజానికి ఉపయోగపడే సందేశంతో రూపొందే చిన్న సినిమాలకు మాత్రం అలాంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే ఈ పరిస్థితుల్లో కూడా ఒక చిన్న సినిమా తన వినూత్నమైన ప్రమోషన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’.

మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా కాన్సెప్ట్ మాత్రమే కాకుండా.. ఈ చిత్రబృందం చేపడుతున్న ప్రచార కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. రైతులకు ఉపయోగపడే అంశాన్ని ఈ సినిమాలో ప్రస్తావించడంతో.. సినిమా ప్రమోషన్‌ను కూడా రైతుల మధ్య నుంచే ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన రాజేందర్ రెడ్డి రైతుబడి అగ్రి షోలో చిత్రబృందం ప్రత్యేకంగా ఒక స్టాల్ ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చిన రైతులకు సినిమా కథా నేపథ్యం, ఇందులో ఉన్న సందేశాన్ని వివరించారు. సాధారణంగా వ్యవసాయ ఎగ్జిబిషన్లలో వ్యవసాయ పరికరాలు, విత్తనాలు, కంపెనీల స్టాళ్లు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఒక సినిమాకు ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేయడం చాలా అరుదైన విషయం.

2026 మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన మెగా రైతు మేళాలో కూడా ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ చిత్రబృందం స్టాల్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు, అధికారులు, స్కాలర్లు, యాక్టివిస్టులు, మహిళా సంఘాల ప్రతినిధులు, రైతులు.. మూవీ స్టాల్‌ను సందర్శించి చిత్రబృందాన్ని అభినందించారు. రైతుల కోసం వారు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రశంసించారు. ప్రపంచం మొత్తం స్మార్ట్ ఫార్మింగ్ వైపు అడుగులు వేస్తున్న ఈ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్‌చెయిన్ వంటి ఆధునిక సాంకేతికతలను సంప్రదాయ వ్యవసాయ జ్ఞానంతో కలిపి భవిష్యత్తులో వ్యవసాయం ఎలా అభివృద్ధి చెందవచ్చో ఈ చిత్రంలో చూపించారు. వ్యవసాయం మరియు సాంకేతికత మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే ఈ సినిమా ప్రధాన లక్ష్యమని చిత్రబృందం చెబుతోంది.

Also Read: YS Jagan: నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం.. కీలక అంశాలపై మాట్లాడనున్న మాజీ సీఎం!

మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా నేటి సామాజిక వాస్తవాలను ప్రతిబింబించే కథతో రూపొందుతోంది. వ్యవసాయంతో పాటు ఆధునిక సమాజంలో పెరుగుతున్న విడాకుల సమస్యను కూడా ఈ చిత్రం ప్రస్తావిస్తుంది. గత తరాలు కుటుంబ విభేదాలను పరిష్కరించడంలో, జంటలకు మార్గనిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషించాయని ఈ సినిమా గుర్తు చేస్తుంది. ఆధునిక స్వేచ్ఛను సంప్రదాయ కుటుంబ విలువలతో ఎలా సమతుల్యం చేయాలనే ప్రశ్నను ఈ చిత్రం ప్రేక్షకుల ముందుంచుతోంది. సందేశాత్మక అంశాలను ప్రస్తావించినప్పటికీ.. ఈ సినిమా పూర్తిగా వినోదాత్మకంగా తెరకెక్కిందని చిత్రబృందం చెబుతోంది. దాదాపు 10 మంది ప్రముఖ కమెడియన్స్ ఈ సినిమాలో నటించడంతో నవ్వులు పంచేలా రూపొందించబడింది. త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. CH.V.S.N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండెం నిర్మించారు. ఈ సినిమాకు మధుదీప్ చెలికాని దర్శకత్వం వహించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వేసవి సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.