
రెండు రాజ్యసభ స్థానాలు బిసి, ఎస్‌సి, ఎస్‌టిలకివ్వాలి
ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలి
రాహుల్ గాంధీకి జాజుల శ్రీనివాస్ గౌడ్ బహిరంగ లేఖ
మన తెలంగాణ / హైదరాబాద్ : బిసి రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు ప్రవేశ పెట్టాలని బిసి జెఎసి చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీకి బిసి డిమాండ్లపై శ్రీనివాస్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కులగణన జరిగి, జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి చట్టబద్ధంగా దక్కాలన్న రాహుల్ గాంధీ నినాదాన్ని, ఆచరణలో చూపించడానికి తెలంగాణ రాష్ట్రాన్ని సామాజిక న్యాయానికి ఒక మోడల్ గా చేయాలని ఆయన రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు. అతి త్వరలో భర్తీ చేయబోయే రెండు రాజ్యసభ స్థానాలలో ఒకటి బిసికి, రెండవది ఎస్‌సి, ఎస్‌టిలకు కేటాయించాలని ఆయన కోరారు.
రాష్ట్రానికి సంబంధం లేని వారిని, ఇప్పటికే తమ జనాభా దామాషా కంటే ప్రాతినిధ్యం ఎక్కువగా రాజకీయంగా ఉన్న అగ్రకులాలకు అవకాశం ఇవ్వకుండా బిసిలకే ఇవ్వాలని ఆయన కోరారు. కామారెడ్డి బిసి డిక్లరేషన్ లో చెప్పిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించే నామినేటెడ్ పోస్టుల్లో, ప్రభుత్వ కాంట్రాక్టులలో, రాష్ట్ర బడ్జెట్ లో, అన్ని స్థాయిల్లోనూ తెలంగాణలో జరిగిన కులగణన ఆధారంగా బిసిలకు జనాభా దామాషా ప్రకారం అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్షలాదిమంది ఉన్నత విద్యను అభ్యసించే పేద బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ, ఈబిసి విద్యార్థులకు స్కాలర్షిప్ లు, ఫీజుల రియింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ ఆదేశించాలని ఆయన కోరారు. నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో అగ్రకుల ఆధిపత్య వర్గాల దాడిలో రెండు నెలల పసికందు మరణించిన విషయంలో రాహుల్ గాంధీ తక్షణమే జోక్యం చేసుకొని నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని, బిసి కుటుంబాలను ఆదుకోవాలని, ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా బిసి రక్షణ చట్టం తేవాలని జాజుల డిమాండ్ చేశారు.