
గోళ్లకు అందమైన మెరుపును అద్దే నెయిల్ పాలిష్‌లే మన ప్రాణాలను బలిగొనే విషాన్ని మోసుకొస్తున్నాయని చెబితే నమ్ముతారా? క్యాన్సర్ రోజురోజుకూ పెరిగిపోతున్న ఈ రోజుల్లో.. చాలా మంది వాడే కాస్మటిక్స్ ప్రాణాంతకంగా మారుతున్నాయి. ప్రముఖ క్యాన్సర్ నిపుణుడు డాక్టర్ తరంగ్ కృష్ణ ఒక పాపులర్ పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో చెప్పిన షాకింగ్ విషయాలు నెయిల్ పాలిష్ ప్రియులను ఒక్కసారిగా ఉలికిపడేలా చేస్తున్నాయి. అందమైన గోళ్ల కోసం మనం తెచ్చిపెట్టుకునే అందం వెనుక క్యాన్సర్ భూతం దాగి ఉందని హెచ్చరించారు డాక్టర్ కృష్ణ.
ప్రస్తుత ఆధునిక కాలంలో అమ్మాయిలు మెరిసే గోళ్లు, జెల్ నెయిల్స్, నెయిల్ ఆర్ట్ అంటే ఎంతో ఇష్ట పడుతున్నారు. అయితే డాక్టర్ తరంగ్ కృష్ణ మాత్రం.. “నెయిల్ పాలిష్ క్యాన్సర్‌కు దారితీస్తుంది” అని కుండబద్దలు కొట్టి చెప్పేశారు. నెయిల్ పాలిష్ తయారీ ఫ్యాక్టరీకి ఒక్కసారి వెళితే అసలు నిజాలు తెలుస్తాయని, అక్కడ వాడే రసాయనాలు ఎంత ప్రమాదకరమైనవో అర్థమవుతుందని అన్నారు.
ALSO READ : కార్ల రేట్లు రూ.20వేలు పెంచాలని మారుతీ సుజుకీ ఫిక్స్.
నెయిల్ పాలిష్‌కు ఆ అద్భుతమైన షైనింగ్, గ్లాసీ లుక్ తీసుకురావడానికి ‘ఫార్మాల్డిహైడ్’ అనే ప్రమాదకరమైన రసాయనాన్ని వాడుతున్నారట. నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ దీనిని క్యాన్సర్ కారక పదార్ధంగా గుర్తించింది. అంతేకాకుండా మార్కెట్లో తక్కువ రేట్లకు దొరికే నెయిల్ పాలిష్‌లలో ‘డీబీపీ’, ‘టోలుయెన్’ అనే హానికరమైన కెమికల్స్ కూడా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ రసాయనాలు గోళ్ల ద్వారా మన శరీరంలోకి సులభంగా శోషించబడతాయి. మరీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ నెయిల్స్ వేసుకున్న తర్వాత చేతులతో నేరుగా ఆహారం తీసుకునేటప్పుడు ఈ విష పదార్థాలు పొట్టలోకి వెళ్లి తీవ్రమైన అనారోగ్యాలకు, క్యాన్సర్‌కు దారితీస్తాయని డాక్టర్ కృష్ణ హెచ్చరించారు. ప్రతి 5 మందిలో ఒక్కరికి వారి అలవాట్ల వల్లనే క్యాన్సర్ ముప్పు భారిన పడుతున్నారని స్టడీస్ చెబుతున్నాయి.
సో బ్యూటీ లవర్స్ ఇప్పటికైనా మేల్కొనడం చాలా ముఖ్యం అంటున్నారు ఈ ఆంకాలజిస్ట్. నెయిల్ పాలిష్ కొనేముందు అందులో వాడిన ఇంగ్రిడియంట్స్ ఏంటో పరిశీలించడం మంచిది. అప్పుడప్పుడు వాడేవారైనా సరే.. నాణ్యమైన, టాక్సిన్-ఫ్రీ ప్రొడక్ట్స్‌ను ఎంచుకోవడం ముఖ్యమన్నారు. అప్పుడే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అందం ముఖ్యమే కానీ.. ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని డాక్టర్ కృష్ణ చెప్పిన మాటలను బట్టి అర్థం అవుతోంది.