Reading Time: 2 minutes
36,000 అడుగుల ఎత్తులో ఇంజిన్ షట్‌డౌన్! ఉపిరి బిగపట్టిన ప్రయాణికులు.. చివరకు..!

మరో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన బోయింగ్ 737 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గాల్లో ఉండగా ఇంజన్‌లో సమస్యలు రావడంతో విమానం తిరిగి కొచ్చికి రావాల్సి వచ్చింది. కొచ్చి నుంచి అబుదాబికి వెళ్తున్న IX 415 విమానం టేకాఫ్ అయిన సుమారు 50 నిమిషాల తర్వాత సమస్య తలెత్తింది. విమానం 36,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో పైలట్లు ఇంజిన్-1లో ఆయిల్ పరిమాణం వేగంగా తగ్గుతున్నట్లు ఫైలట్లు గుర్తించారు. పరిస్థితిని అంచనా వేసిన సిబ్బంది అబుదాబి ప్రయాణాన్ని నిలిపివేసి కొచ్చికి తిరిగి రావాలని నిర్ణయించారు.

36 వేల అడుగుల ఎత్తులో సమస్య గుర్తింపు

ఆయిల్ స్థాయి నిరంతరం తగ్గుతుండటంతో పైలట్లు FORDEC విధానంలో పరిస్థితిని విశ్లేషించారు. ప్రయాణాన్ని కొనసాగించడం కంటే విమానాన్ని తిరిగి కొచ్చికి మళ్లించడమే సురక్షితమని నిర్ణయించారు. కమాండర్ ముంబై రేడియో ద్వారా ATCకి సమాచారం అందించి విమానం కొచ్చికి తిరిగి వస్తున్నట్లు తెలిపారు.

విమానం తిరుగు ప్రయాణంలో ఉన్న సమయంలో కూడా పైలట్లు ఇంజిన్‌కు సంబంధించిన అన్ని పారామీటర్లను నిరంతరం పర్యవేక్షించారు. సుమారు 45 నిమిషాల తర్వాత ఇంజిన్-1 ఆయిల్ ప్రెషర్‌లో తీవ్ర హెచ్చుతగ్గులు ఏర్పడి, కాక్‌పిట్ గేజ్‌లో రెడ్ జోన్‌కు చేరుకుంది. దీంతో సిబ్బంది నాన్-నార్మల్ చెక్‌లిస్ట్‌ను అనుసరించి ఇంజిన్-1ను ఆపివేశారు.

ఒకే ఇంజిన్‌తో సురక్షిత ల్యాండింగ్

ఇంజిన్-1ను షట్‌డౌన్ చేసిన అనంతరం బోయింగ్ 737 విమానం ఒకే ఇంజిన్‌తో కొచ్చి వైపు ప్రయాణించింది. తిరుగు ప్రయాణంలో విమానం సాధారణ ల్యాండింగ్ బరువుకంటే ఎక్కువ బరువుతో ఉండటం వల్ల ల్యాండింగ్ సిబ్బందికి మరింత సవాలుగా మారిందని నివేదికలు పేర్కొంటున్నాయి. అయినప్పటికీ పైలట్ల సమర్థవంతమైన నిర్ణయం, ప్రామాణిక భద్రతా విధానాల అమలుతో విమానం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని ఎయిర్ ఇండియా పేర్కొంది.

వరుస సాంకేతిక ఘటనల నేపథ్యంలో ఆందోళన

భారత విమానయాన రంగంలో ఇటీవల వరుసగా సాంకేతిక కారణాలతో విమానాలు దారి మళ్లిస్తున్న నేపథ్యంలో IX 415 ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఖచ్చితమైన సాంకేతిక కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, DGCA నుంచి అధికారిక వివరణ రావాల్సి ఉంది. ఇదే సమయంలో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా ఫుకెట్–ఢిల్లీ విమాన ఘటనపై AAIB ప్రాథమిక నివేదిక కూడా వెలువడింది. దీంతో విమానయాన భద్రతా ప్రమాణాలు, సాంకేతిక తనిఖీలు, నిర్వహణ విధానాలపై మరోసారి చర్చ మొదలైంది.

ప్రయాణికులకు ఊరట

విమానం 36 వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడే సమస్యను గుర్తించడం, పరిస్థితిని వేగంగా అంచనా వేసి అబుదాబికి వెళ్లకుండా కొచ్చికి తిరిగి రావడం, అవసరమైన సమయంలో ఇంజిన్‌ను షట్‌డౌన్ చేయడం ద్వారా పైలట్లు ప్రమాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ప్రస్తుతం విమానం సురక్షితంగా కొచ్చిలో ఉంది. ఇంజిన్‌లో ఆయిల్ వేగంగా ఎందుకు తగ్గింది? దానికి కారణమైన సాంకేతిక లోపం ఏమిటి? విమానం తదుపరి ఎప్పుడు సర్వీసులోకి వస్తుంది? అనే అంశాలపై అధికారిక దర్యాప్తు, తనిఖీల తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..