
ఏపీలో టీడీపీ, వైసీపీ పార్టీలు రెండూ ఫ్యాక్షన్ పార్టీలుగా మారిపోయాయని అన్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. సోమవారం ( సెప్టెంబర్ 7 ) మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు విజయసాయి. టీడీపీ రెడ్ బుక్ పార్టీ.. వైసీపీ రప్పా రప్పా పార్టీ అని అన్నారు. రాష్ట్రంలో కొత్త పార్టీ అవసరం ఉందని.. టీడీపీ, వైసీపీ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయని..లెఫ్ట్ పార్టీలు, కొత్త పార్టీలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం లేదని అన్నారు.
రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య ప్రజలు నలిగిపోతున్నారని.. అభివృద్ధి కుంటుపడుతోందని అన్నారు విజయసాయి. కొత్త పార్టీ స్థాపించనున్నానని.. తన పార్టీలో సీఎం అభ్యర్థి తాను కాదని ప్రకటించారు విజయసాయి. రాష్ట్రాన్ని రెండు రాజకీయ కుటుంబాలే పాలించాలా..? రాష్ట్రంలో రెడ్లు, కమ్మలే కాదు అనేక వర్గాలున్నాయని అన్నారు విజయసాయి.
రెడ్లు, కమ్మలు కాకుండా సీఎంలు కాలేదని…బీసీల్లో ఎంతోమంది సామర్థ్యం కలిగినవారు ఉన్నారని.. కానీ, రెండు కుటుంబాలే సీఎం పదవి చేజిక్కించుకుంటున్నాయని అన్నారు. తన పార్టీలో తాను, తన కుటుంబసభ్యులు ఉండరని స్పష్టం చేశారు విజయసాయి. బాల్ థాకరే తరహాలో పార్టీకి మెంటర్ గా ఉంటానని అన్నారు.