Reading Time: < 1 minute

డాక్టర్లపై దాడిచేసే రాజకీయనాయకులను అరెస్ట్ చేయాలె.. ఫ్రీగా తిరగనీయెుద్దు: సుప్రీం కోర్టు

Caption of Image.

వైద్యులు దేవుళ్లతో సమానం అంటారు. ప్రజల ప్రాణాలు కాపాడే అలాంటి వారిపైనే రాజకీయ నాయకులు దాడులకు తెగబడటం అత్యంత ఆందోళనకరమని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో రాజకీయ పార్టీల సభ్యులు వైద్యులపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతుండటంపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వైద్యుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ.. దాడులకు పాల్పడే ఏ రాజకీయ నాయకుడినైనా సరే వెంటనే అదుపులోకి తీసుకోవాలని అక్కడి ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగిన ఓ దారుణ ఘటనే ఈ ఆదేశాలకు ప్రధాన కారణం. దహి హండి ఉత్సవంలో గాయపడిన వ్యక్తి డిశ్చార్జ్ విషయంలో రిలీఫ్ హాస్పిటల్ సిబ్బందితో వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో శివసేన ఏక్ నాథ్ షిండే వర్గం జిల్లా చీఫ్ కుందన్ సంఖే, సిటీ చీఫ్ రాహుల్ ఘరత్ సహా సుమారు 17 మంది ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి బలవంతంగా ప్రవేశించారు. వైద్యులు, సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన రిసెప్షనిస్ట్ పై చేయి చేసి.. మహిళా ఉద్యోగినిని తీవ్రంగా బెదిరించారు. ఈ తతంగమంతా ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది.

►ALSO READ | ఉల్లి ధర తగ్గించేందుకు కేంద్రం చర్యలు..10 రోజుల్లో 4 వేల టన్నుల బఫర్ స్టాక్ విక్రయం

ఈ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా పరిగణించి కఠినంగా స్పందించింది. ప్రజా సంక్షేమం కోసం శ్రమించే వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది. రాజకీయ నాయకులమనే అహంకారంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపట్ల ఎలాంటి ఉదాసీనత చూపరాదని హెచ్చరించింది. దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని మహారాష్ట్ర పోలీసులను ఆదేశించింది.

వైద్య రంగంలో పనిచేస్తున్న సిబ్బందిపై, డాక్టర్లపై భౌతిక దాడులు జరిగితే అత్యవసర వైద్య సేవలు నిలిచిపోయి రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అందుకే ఇలాంటి ఘటనలపై న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. కోర్టు తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం వైద్యులకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని, తద్వారా భవిష్యత్తులో ఇలాంటి దాడులు రిపీట్ కాకుండా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

©️ VIL Media Pvt Ltd.