Reading Time: < 1 minute
Singareni 128 Employees Deputy Cm Bhatti Vikramarka Key Announcement On Alias Names Issue

Deputy CM Bhatti Vikramarka: శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి కాలరీస్‌లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న మారుపేర్ల సమస్యపై కీలక ప్రకటన చేశారు. ఈ సమస్యను మానవీయ కోణంలో పరిశీలించి పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో పెండింగ్‌లో ఉన్న మారుపేర్ల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసిందని భట్టి విక్రమార్క వెల్లడించారు. కమిటీ సమర్పించే సిఫార్సుల ఆధారంగా స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఈ సమస్య ఇటీవల ఏర్పడింది కాదని, 1997 నుంచే సింగరేణిలో కొనసాగుతున్న పాత సమస్య అని తెలిపారు. అధికారిక రిజిస్టర్‌లో ఒకరి పేరు ఉండగా, వారి స్థానంలో మరొకరు విధులు నిర్వహించే పరిస్థితులు గతంలో ఉన్నాయని వివరించారు. చట్టప్రకారం ఒకరి పేరుతో మరొకరు ఉద్యోగం చేయడం తీవ్రమైన నేరపూరిత అంశమే అయినప్పటికీ.. కార్మికుల పరిస్థితులను అర్థం చేసుకుని గతంలో సింగరేణి యాజమాన్యం మానవీయ కోణంలో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించిందని భట్టి పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలతో అప్పట్లో 45 మంది అధికారులతో పాటు సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం సింగరేణిలో దాదాపు 90 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, మారుపేర్ల సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య కేవలం 128 మంది మాత్రమేనని భట్టి విక్రమార్క చెప్పారు. సంఖ్య పరంగా ఇది పెద్ద సమస్య కాకపోయినా, చట్టపరమైన చిక్కులు ఉండటంతో అధికారులు నిర్ణయం తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.

ఒకవైపు భవిష్యత్తులో నిబంధనల ప్రకారం చర్యలు ఎదురవుతాయన్న అధికారుల ఆందోళన, మరోవైపు సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించిందన్నారు. చాలా ఏళ్లుగా సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఏ ఒక్క అధికారిపైనా భారం పడకుండా కమిటీ ద్వారా సమగ్రంగా పరిశీలించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కమిటీ నివేదిక అందిన వెంటనే 128 మంది మారుపేర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.