
AI మన జీవితాలను సులభతరం చేస్తుందని అందరూ భావిస్తుంటే.. దాని సృష్టికర్తలేమో ఇప్పుడు వెన్నులో వణుకు పుట్టించే నిజాలు బయటపెడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు గురించి ఓపెన్‌ఏఐ చీఫ్ సైంటిస్ట్ జాకుబ్ పచోకి చేసిన సంచలన హెచ్చరికలు టెక్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలికిపడేలా చేస్తున్నాయి. భవిష్యత్ ఏఐ సిస్టమ్స్ కేవలం మనుషుల ఉద్యోగాలను లాక్కోవడమే కాకుండా.. ఏకంగా మనుషులను మోసం చేయడం, భయపెట్టడం, బ్లాక్‌మెయిల్ చేయడం నేర్చుకుంటాయని చెప్పటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సెప్టెంబర్ 6న ‘ఎన్ ఏలియన్ మైండ్’ పేరుతో పచోకి విడుదల చేసిన బ్లాగ్ పోస్ట్ ప్రస్తుతం అంతటా చర్చనీయాంశమైంది. టెక్నాలజీ ఈ వేగంతో దూసుకెళ్తే దాని పరిణామాలను ఎదుర్కోటానికి ప్రపంచం ఇప్పటికైతే సిద్ధంగా లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతానికి మనం చూస్తున్న ఏఐ అసిస్టెంట్లు కేవలం ఆరంభం మాత్రమేనని.. రాబోయే రోజుల్లో ఇవి మనుషులను మించిపోయే స్వయంప్రతిపత్తిని సంతరించుకుంటాయని హెచ్చరించారు.
ఓపెన్‌ఏఐ ఇటీవల ప్రవేశపెట్టిన ‘జీపీటీ-6 ఆస్ట్రా’ వంటి అత్యంత శక్తివంతమైన మోడళ్లు టెక్ రంగంలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఏఐ ఎంతగా ఎదిగితే దాని ఆలోచనలను పర్యవేక్షించడం అంత కష్టమవుతోందని పరిశోధకులు అంగీకరిస్తున్నారు. నిర్దిష్టమైన లక్ష్యాలతో శిక్షణ పొందిన ఏఐ ఏజెంట్లు, భవిష్యత్తులో తమ స్వార్థ ప్రయోజనాల కోసం దాడులకు ఒడిగట్టే ప్రమాదం ఉందని పచోకి ఆందోళన వ్యక్తం చేశారు.
“రేపటి ఏఐ సిస్టమ్స్ తమ లక్ష్యాలను సాధించుకోవడానికి మనుషులతో బేరసారాలు ఆడతాయి, ట్రిక్స్ వేస్తాయి.. ఏకంగా బ్లాక్‌మెయిల్ చేయడానికి కూడా వెనుకాడవు” అని పచోకి చెప్పటం టెక్ ప్రపంచంలో భూకంపం సృష్టిస్తోంది. ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా అనిపించినా.. రేపు నిజం కాబోయే భయానక వాస్తవమని హెచ్చరించారు ఆయన. మానవ నియంత్రణను దాటి స్వతంత్రంగా ఆలోచించే ఈ శక్తిని అదుపు చేయడం ఇప్పుడే కష్టతరంగా మారుతోందని ఏఐ రంగం లోపల జరుగుతున్న నిజాలను బయటపెట్టారు.
ఈ వినాశకర పరిణామాల నుంచి మానవాళిని కాపాడుకోవాలంటే కేవలం స్పీడ్ మాత్రమే సరిపోదని, పటిష్టమైన భద్రతా ప్రమాణాలు అవసరమని పచోకి చెప్పుకొచ్చారు. ఏఐ అభివృద్ధిలో కఠినమైన రూల్స్, నిఘా వ్యవస్థలు లేకపోతే ఈ సాంకేతికత మానవజాతికే పెను ముప్పుగా మారుతుందని అంగీకరించారు సైంటిస్ట్. టెక్ దిగ్గజాల చేతుల్లో ఉన్న ఈ ‘ఏలియన్ మైండ్’ ఎలాంటి అనూహ్య పరిణామాలకు దారితీస్తుందోనని నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.