
నేపాల్‌లో సంభవించిన వరదల్లో కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరుకు చెందిన చొప్పరపు రమేష్ (53) అదృశ్యమయ్యారు. రమేష్ ఆచూకీ తెలియకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తన భర్త సురక్షితంగా ఉన్నాడో లేదో తెలియక భార్య సనీత కన్నీరుమున్నీరవుతున్నారు. రమేష్ గత 15 సంవత్సరాలుగా ఖతార్‌లోని దోహాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెలలో ఆయన స్వగ్రామమైన కానూరుకు వచ్చారు. అనంతరం ఆగస్టు 14న తిరిగి ఖతార్‌కు వెళ్లారు. అక్కడి నుంచి నేపాల్‌కు విహారయాత్రకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
నేపాల్‌కు బయలుదేరుతున్నట్లు రమేష్ తన బంధువులకు మెసేజ్ కూడా పంపారు. ఆ తర్వాత ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందన లేకపోవడంతో రమేష్ భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేపాల్ వరదల్లో రమేష్ చిక్కుకున్నట్లు సమాచారం రావడంతో ఆయన పేరును మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయంలోని గల్లంతైన వారి జాబితాలో చేర్చారు. దీంతో కుటుంబ సభ్యులు అధికారులను సంప్రదిస్తూ రమేష్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.
తన భర్త ఎక్కడ ఉన్నారో వెంటనే గుర్తించి, ఆయనను సురక్షితంగా తమ వద్దకు తీసుకురావాలని రమేష్ భార్య సనీత అధికారులను వేడుకుంటున్నారు. రమేష్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు కుటుంబ సభ్యులు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. నేపాల్‌లో వరదల కారణంగా పలువురు యాత్రికులు, పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. రమేష్ ఆచూకీ కోసం అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. రమేష్ సురక్షితంగా బయటపడాలని కుటుంబ సభ్యులు, బంధువులు ఆశిస్తున్నారు.