
హిమాలయాల్లో సంభవించిన ఘోరమైన గ్లేషియల్ సరస్సు విస్ఫోటనం నేపాల్‌లో కనీవినీ ఎరుగని జల విలయాన్ని సృష్టించింది. కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే ఉప్పొంగి ప్రవహించిన వరద ఉధృతి నేపాల్-టిబెట్ సరిహద్దును తాకడంతో పెను విధ్వంసం చోటుచేసుకుంది. ఈ విపత్తు తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే.. కేవలం నేపాల్‌కే పరిమితం కాకుండా దాదాపు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సరిహద్దులు దాటి భారత్ వరకు మృతదేహాలు కొట్టుకొచ్చాయి.
ఈ మహా ప్రళయంలో నేపాల్‌లో దాదాపు 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గల్లంతయ్యారు. నేపాల్‌లోని నువాకోట్, ధాడింగ్, చిత్వాన్ వంటి వివిధ జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సరిహద్దు ప్రాంతమైన చిత్వాన్‌లో అత్యధికంగా 132 మృతదేహాలను వెలికితీశారు. ప్రకృతి సృష్టించిన ఈ భీకర ప్రళయానికి నేపాల్‌లోని నదులు ఉప్పొంగి ప్రవహించి పొరుగు దేశమైన భారత్‌ను కూడా తాకాయి.
భారత్‌లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఆనుకుని ఉన్న నేపాల్ దక్షిణ ప్రాంతం నుంచి ప్రవహిస్తున్న నదుల్లో భారీగా శవాలు కొట్టుకొచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్, కుషీనగర్ జిల్లాల్లో నదుల గుండా కొట్టుకొచ్చిన 7 మృతదేహాలను అధికారులు గుర్తించి రికవరీ చేశారు. మహారాజ్‌గంజ్ జిల్లాలో నదిలో తేలుతున్న 4 మృతదేహాలను గురువారం నాడు వెలికితీసినట్లు జిల్లా మేజిస్ట్రేట్ గౌరవ్ సింగ్ సోగర్వాల్ తెలిపారు.
అలాగే సరిహద్దుకు దాదాపు 70 కిలోమీటర్ల దిగువన ఉన్న కుషీనగర్ జిల్లాలో మరో 3 మృతదేహాలను పోలీసులు రికవరీ చేశారు. నేపాల్ నుంచి గండక్ నది ద్వారా కొట్టుకొచ్చిన ఈ శవాలను సశాస్త్ర సీమా బల్ సిబ్బంది, స్థానిక పోలీసులు కలిసి బయటకు తీశారు. రికవరీ చేసిన వాటిలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడి మృతదేహాలు గండక్ నదిలో లభించినట్లు ఎస్‌ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ అరుణ్ పాండే వెల్లడించారు.
టిబెట్ వైపు నుంచి వచ్చిన ఈ వరద ఉధృతిని ముందుగా అంచనా వేయలేకపోవడం వల్ల ప్రాణనష్టం భారీగా సంభవించింది. నేపాల్ ఫ్లడ్ ఫోరెకాస్టింగ్ డివిజన్ వేల సంఖ్యలో ఎస్ఎంఎస్ అలర్ట్స్ పంపినప్పటికీ.. వరద వేగం ముందు అన్నీ తలవంచాయి. త్రిశూలి, నారాయణి నదుల గుండా ప్రవహించిన ఈ వరద ధాటికి నేపాల్ సరిహద్దులు దాటి ఉత్తరప్రదేశ్ వరకు చనిపోయిన వారి శరీరాలు కొట్టుకురావడం ఈ విపత్తు ఎంత భయానకమైనదో తెలియజేస్తోంది. అయితే మరిన్ని మృతదేహాలు లభ్యం అవ్వొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.