Reading Time: 2 minutes
Revanth Reddy Goa Speech Property Sawant Remarks

గోవా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘గోయ్ రాఖోన్న్ యాత్ర’ (Save Goa Campaign) ముగింపు సందర్భంగా కున్కోలిమ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సంచలన ప్రసంగం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న ప్రజా నిరసన కార్యక్రమాల నేపథ్యంలో అగ్రనేత రాహుల్ గాంధీ గోవాకు రాలేకపోయారని, అందుకే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు తాను ఆయన ప్రతినిధిగా ఇక్కడికి వచ్చానని సీఎం తెలిపారు. గోవా ప్రజలు బీజేపీ పాలనతో పూర్తిగా విసిగిపోయారని, ఒకవేళ మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తే స్థానిక ప్రజలు తమ సొంత గడ్డపైనే పరాయివారైపోయే ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.

గోవా సీఎం కాదు.. ‘ప్రాపర్టీ సావంత్’..

ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తీరుపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన గోవాను అభివృద్ధి చేసే పనిలో లేరని, కేవలం ఇక్కడి భూములు, ఆస్తులను ఇతరులకు కట్టబెట్టే పనుల్లో బిజీగా ఉన్నారని ఆరోపించారు. అందుకే గోవా ప్రజలు ఆయన్ను ‘ప్రమోద్ సావంత్’ అనడం మానేసి ‘ప్రాపర్టీ సావంత్’ అని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇక్కడి అరుదైన భూములు, పర్యావరణం, వారసత్వం శరవేగంగా అన్యాక్రాంతమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

డ్రగ్స్ రాజధానిగా గోవా.. ‘నషా ముక్త్ భారత్’ ఏమైంది?

బీజేపీ పాలనలో సుందరమైన గోవా కాస్తా డ్రగ్స్ కేంద్రంగా మారిపోయిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘నషా ముక్త్ భారత్’ (డ్రగ్స్ రహిత భారత్) అంటూ గొప్పలు చెబుతోందని, మరి అదే నినాదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు ఎందుకు గోవాలో అమలు చేయడం లేదని నిలదీశారు. డ్రగ్స్ లార్డ్స్, ల్యాండ్ మాఫియాకు గోవా అడ్డాగా మారిందని, ఇది రాష్ట్ర కీర్తిని దిగజార్చుతోందని అన్నారు. గోవా యువత డ్రగ్స్‌కు బానిసలు కావద్దని, రాష్ట్రం పేరు చెడిపోవద్దన్నదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు.

జ్ఞానేష్ కుమార్ పేరుతో ఓట్ల తొలగింపు కుట్ర..  

దేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించే శక్తులు ఇప్పుడు బలహీనపడ్డాయని, అందుకే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ పేరును అడ్డుపెట్టుకుని పేదలు, దళితులు, మైనారిటీలు, ఆదివాసీల ఓట్లను తొలగించే కుట్రకు తెరలేపారని సీఎం రేవంత్ ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పోరాటం ‘రావణుడు’ (బీజేపీ)కి, ‘రాముడు’ (కాంగ్రెస్)కి మధ్య జరుగుతున్న పోరాటమని అభివర్ణించారు. రావణుడి పాలనను అంతం చేయాలంటే ప్రజలంతా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవాలని కోరారు. గతంలో రెండుసార్లు మోసపోయిన గోవా ప్రజలు, మూడోసారి కూడా బీజేపీని నమ్మి మోసపోవద్దని హితవు పలికారు.

2027లో గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖాయం

దేశంలో రుతుపవనాలు (మాన్‌సూన్) ముందుగా కేరళలో ప్రవేశించి, ఆ తర్వాత గోవాకు వస్తాయని గుర్తుచేసిన రేవంత్ రెడ్డి.. అదే మాన్‌సూన్ సెంటిమెంట్‌ను గుర్తుచేశారు. ఇప్పటికే కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని, అలాగే 2027లో రాబోయే మాన్‌సూన్ నాటికి గోవాలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. గోవా గడ్డపై నుంచి ప్రారంభమయ్యే ఈ మార్పు దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై మువర్ణాల జెండాను ఎగరేసే వరకు నిలవదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పార్టీ కోసం కాదని, కేవలం గోవా ప్రజల భవిష్యత్తు కోసమే అని ఆయన పునరుద్ఘాటించారు.