Reading Time: 2 minutes
‘నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు’ బిచ్చగాడికి 21 మంది భార్యలు! ఒకే గుడిసెలో ఉమ్మడి కాపురం

ఢాకా, అక్టోబర్ 12: సాధారణంగా ఒక వ్యక్తికి ఒకరు లేదా ఇద్దరు భార్యలు ఉంటేనే కుటుంబ బాధ్యతలు నిర్వహించడం కష్టంగా మారుతుందని అంటుంటారు. అలాంటిది ఏకంగా 21 మంది భార్యలు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. బంగ్లాదేశ్‌కు చెందిన 35 ఏళ్ల మోరు మియా ఇప్పుడు ఇదే కారణంతో ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారాడు. తనకు 21 మంది భార్యలు ఉన్నారని, అయితే వారందరి పేర్లను గుర్తుంచుకోవడం కూడా కొన్నిసార్లు కష్టమవుతోందని అతడు చెప్పినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. మోరు మియా చెప్పిన వివరాల ప్రకారం.. తాను ఎప్పుడూ పెళ్లి సంబంధాల కోసం మహిళల వెంట పడలేదని, ఆయా మహిళలే తన వద్దకు వచ్చి పెళ్లి చేసుకుందామని ప్రతిపాదించేవారని తెలిపాడు. తనలో మహిళలకు ఏం నచ్చుతుందో తనకు తెలియదని, ఆ విషయం వారినే అడగాలని అన్నాడు. ‘నాలో వారికి ఏం నచ్చుతుందో నాకు తెలియదు. దానికి వారే సమాధానం చెప్పాలి. మహిళలే నా దగ్గరకు వచ్చి.. పెళ్లి చేసుకుందాం అని అడుగుతారు’ అని అతడు స్థానిక మీడియాతో చెప్పినట్లు సమాచారం.

కాదనడం మర్యాద కాదని ఒప్పేసుకున్నా..!

తనకు పెళ్లి ప్రతిపాదనలు చేసిన మహిళల్లో చాలామంది తనకంటే వయసులో పెద్దవారని మోరు మియా వెల్లడించినట్లు కథనాలు చెబుతున్నాయి. అయితే వారి ప్రతిపాదనలను తిరస్కరించడం తనకు ఇష్టం లేకపోయిందట. ఒక మహిళ పెళ్లి చేసుకుంటానని అడిగినప్పుడు ఆమెను కాదనడం అగౌరవపరిచినట్లుగా భావించానని చెప్పినట్లు సమాచారం. ఈ విధంగా ఒక్కొక్కరుగా తన జీవితంలోకి వచ్చిన మహిళల సంఖ్య 21కి చేరిందని అతడి కథనం. 21 మంది భార్యలు ఉన్నప్పటికీ మోరు మియా జీవనశైలి మాత్రం చాలా సాధారణంగా ఉంటుందని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. అతడు ఒక చిన్న గుడిసెలో నివసిస్తూ, భిక్షాటన ద్వారా వచ్చే డబ్బుపైనే ప్రధానంగా ఆధారపడుతున్నట్లు సమాచారం. అతడి రోజువారీ జీవన విధానం కూడా ఆసక్తికరంగా ఉందని చెబుతున్నారు. ప్రతిరోజూ ఒక భార్య అతడితో కలిసి భిక్షాటనకు వెళ్తుందట. ఈ విధంగా భార్యలు వంతులవారీగా అతడితో పాటు వెళ్తారని కథనాలు వెల్లడించాయి.

ఒకే గుడిసెలో ఉమ్మడి కాపురం.. భిక్షాటనే ఆదాయం

మోరు మియాకు 21 మంది భార్యలు ఉన్నప్పటికీ.. విలేకరులు వారి పేర్లు అడిగినప్పుడు అందరి పేర్లను చెప్పలేకపోయాడని సమాచారం. అతడికి గుర్తున్న పేర్లలో షీలా, నర్గీస్, సెలీనా, ఆలియా, తారా, జ్యోత్స్నా, రాబియా, పారుల్ ఉన్నట్లు కథనాలు పేర్కొన్నాయి. ఇంతమంది భార్యల పేర్లను, వారి వివరాలను గుర్తుంచుకోవడం తనకు సవాలుగా మారిందని అతడు అంగీకరించినట్లు తెలుస్తోంది. మోరు మియా ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు అతడి పరిస్థితిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంత పెద్ద కుటుంబాన్ని భిక్షాటన ద్వారా వచ్చే ఆదాయంతో ఎలా పోషిస్తున్నాడని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఈ ఘటనను మరో కోణంలో చూస్తున్నారు. సమాజంలో వివాహం చేసుకోలేక ఒంటరిగా మిగిలిపోయిన మహిళలకు అతడు తోడుగా నిలిచాడని అభిప్రాయపడుతున్నారు.

‘సమాజం తిరస్కరించిన మహిళలకు అతడు జీవితంలో ఒక ఆశను ఇచ్చాడని భావించవచ్చు. వారు ఒక వ్యక్తి తోడు కోరుకున్నారు. అతడు వారిని అంగీకరించాడు. ఆ కోణంలోనూ ఈ ఘటనను చూడాలి’ అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించగా, మరికొందరు అతడి పట్ల మహిళలకు ఉన్న ఆకర్షణపై సరదాగా స్పందించారు. ‘మహిళలను ఆకట్టుకునే అతడి ప్రత్యేకత ఏమిటో అధ్యయనం చేయాలి’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా, ‘ఇది బంగ్లాదేశ్‌లోనే సాధ్యమేనేమో’ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. మొత్తానికి.. 21 మంది భార్యలున్నారని చెప్పుకుంటున్న మోరు మియా కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.