
సౌదీ అరేబియాలోని రియాద్ విమానాశ్రయంపై ఆదివారం రాత్రి జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో హైదరాబాద్ మెహదీపట్నానికి చెందిన మహమ్మద్ యూసుఫ్ మృతి చెందగా, భార్య, పిల్లలు స్వల్పగాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న భారత రాయబార కార్యాలయం బాధిత కుటుంబంతో పాటు యూసఫ్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. మెహదీపట్నంలోని పిల్లర్ నంబర్ 19 సమీపంలోని గ్రేస్ పారడైజ్ అపార్ట్‌మెంట్‌లో నివసించే మహమ్మద్ యూసుఫ్ సౌదీ అరేబియాలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయన తరచూ హైదరాబాద్‌కు వచ్చి వెళ్తుండేవారని బంధువులు చెప్తున్నారు
అయితే వారం రోజుల క్రితం ఆయన భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తెతో కలిసి ఉమ్రా యాత్ర కోసం సోది వెళ్లారు యూసఫ్. విమానాశ్రయం నుంచి మదీనాకు వెళ్లేందుకు వేచి చూస్తున్న సమయంలో ఎయిర్ పోర్ట్ పై జరిగిన దాడిలో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు నిర్ధారించారు. ఇక యూసఫ్ మృతదేహాన్ని స్వదేశానికి తిరిగి పంపేందుకు భారత రాయబార కార్యాలయంలో కుటుంబసభ్యులతో చర్చలు జరుపుతోంది.
మరో వైపు ఘటనపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించాలని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. యూసుఫ్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియతో పాటు గాయపడిన కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయంపై కేంద్ర ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయం దృష్టి సారించాలని కోరారు. విదేశీ గడ్డపై జరిగిన ఈ విషాద ఘటనలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం, వైద్య సహాయం అందేలా చూడటం, మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తీసుకురావడం ప్రస్తుతం అత్యంత కీలకంగా మారాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.