Reading Time: < 1 minute
Ind Vs Wi 3rd T20i Shreyas Iyer Reaction 14 Run Win

ఇండోర్‌లోని హోల్కర్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో 14 పరుగుల తేడాతో విజయం సాధించిన అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టు ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లోని విజయానికి ఆటగాళ్ల స్పష్టమైన ప్రణాళికలు, దూకుడుతో కూడిన వైఖరే కారణమని పేర్కొన్నాడు. పవర్‌ప్లేలో ఓపెనర్ అభిషేక్ శర్మ అందించిన మెరుపు ఆరంభం జట్టుకు కొండంత బలాన్ని ఇచ్చిందని, అతనికి తోడుగా ఇషాన్ కిషన్ గత కొన్ని నెలలుగా మైదానంలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడని ప్రశంసించాడు. మధ్యలో వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ, మిడిలార్డర్ బ్యాటర్లు సమయస్ఫూర్తితో ఆడి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారని వివరించాడు. ఆఖరి ఓవర్లలో ప్రిన్స్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ జట్టును 223 పరుగుల భారీ స్కోరుకు చేర్చడంలో అత్యంత కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశాడు.

వెస్టిండీస్ జట్టులో ఎవరైనా మ్యాచ్‌ను తిప్పేయగల మ్యాచ్ విన్నర్లు ఉన్నారని, అందుకే వారిని ఏమాత్రం తక్కువగా అంచనా వేయలేమని శ్రేయస్ స్పష్టం చేశాడు. మ్యాచ్ ఏ దశలోనూ అలసత్వానికి తావివ్వకుండా.. చివరి వరకు పాజిటివ్ ఆలోచనలతో ఆడటం ఎంతో అవసరమని చెప్పాడు. తర్వాత జరగబోయే హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్‌లు కూడా భారీ స్కోర్లు నమోదయ్యే వేదికలేనని, అయితే తమ ప్రాసెస్, నిత్యం పాటించే దినచర్యలకే కట్టుబడి ఉంటూ అటాకింగ్ అప్రోచ్‌తో ముందుకు సాగుతామని ధీమా వ్యక్తం చేశాడు.

ఈ మ్యాచ్‌లో డ్రై బాల్ లభించడం కెప్టెన్‌గా తనకు, బౌలర్లకు ఎంతో కలిసి వచ్చిందని శ్రేయస్ అభిప్రాయపడ్డాడు. తడి బంతితో పోలిస్తే, పొడి బంతితో బౌలింగ్ వేసేటప్పుడు బౌలర్లలో ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించిందని తెలిపాడు. ప్రణాళికల అమలు విషయంలో బౌలర్లు స్పష్టమైన ఆలోచనతో ఉన్నారని.. వారికి బంతిని అందించిన ప్రతిసారీ సవాలును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని ప్రశంసించాడు. ఏదేమైనా రెండో టీ20లో భారీ స్కోర్ ఛేదించిన వెస్టిండీస్‌కు ఈ స్కోరు కూడా ఛేదిస్తుందని.. ఓటమి తప్పదేమో అని అనుకున్నట్లు శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ బౌలింగ్‌కు అనుకూలించడం వల్ల మ్యాచ్ మా వైపు తిరిగిందన్నాడు.