July 14, 2026

Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్‌లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్

Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్‌లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
Reading Time: 2 minutes
Shubman Gill Virat Kohli 2027 Odi World Cup Plans India Captain Press Conference

Virat Kohli: భారత క్రికెట్ జట్టులో మరో కొత్త శకానికి తెరలేచింది. రాబోయే 2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా టీమిండియా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అయితే ఈ మెగా టోర్నీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవితవ్యంపై గత కొంతకాలంగా నెట్టింట, క్రీడా వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సోమవారం ఓ కీలక ప్రకటన చేశాడు. ఇంగ్లాండ్‌తో జరగబోయే మొదటి వన్డే మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ మాట్లాడాడు. రాబోయే ప్రపంచకప్ ప్రణాళికల్లో కోహ్లీ కేవలం ఒక ఆటగాడిగానే కాకుండా, జట్టును నడిపించే కీలక లీడర్‌గా భాగస్వామి అయ్యాడని గిల్ స్పష్టం చేశాడు.

“నిజానికి నిన్న కాక మొన్ననే (శనివారం) నేను, విరాట్ భాయ్ కూర్చుని 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించాం. జట్టు కాంబినేషన్స్ ఎలా ఉండాలి, స్క్వాడ్‌లో ఎవరెవరు ఉండే అవకాశం ఉంది, ప్రస్తుతం జట్టులో లేకపోయినా భవిష్యత్తులో మనకు కీలకమయ్యే ఆటగాళ్లు ఎవరు, ఏ ప్లేయర్ ఏ స్థానంలో సరిగ్గా సరిపోతాడు.. అనే విషయాలపై మేమిద్దరం కలిసి ప్లాన్ చేశాం” అని గిల్ వివరించాడు. గతంలో టెస్ట్, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీ జట్టు వ్యూహాల్లో అంతగా యాక్టివ్‌గా పాల్గొనలేదు. అంతేకాకుండా, తాను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేని చోట ఎక్కువ కాలం కొనసాగలేనని కోహ్లీ ఇటీవల వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో.. గిల్ కెప్టెన్సీలో కోహ్లీ ఎంత ప్రాధాన్యమైన వ్యక్తినో ఈ తాజా చర్చ స్పష్టం చేస్తోంది. ఇది జట్టులో కోహ్లీ ప్రాధాన్యతను మరింత పెంచేలా ఉంది.

గణాంకాల పరంగా చూస్తే వన్డేల్లో భారత్‌ తరఫున ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కెప్టెన్లందరిలోకి విరాట్ కోహ్లీదే అత్యుత్తమ రికార్డ్. ఆయన 95 వన్డే మ్యాచ్‌ల్లో టీమిండియాను నడిపించి, ఏకంగా 65 మ్యాచ్‌ల్లో విజయాన్ని అందించాడు. కోహ్లీ విన్నింగ్ పర్సంటేజ్ 68.42 శాతంగా ఉంది. ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వయసుపై కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నప్పటికీ, వన్డే జట్టుకు వీరిద్దరూ ఎంత అవసరమో కెప్టెన్ గిల్ మరోసారి నొక్కిచెప్పాడు. గత దశాబ్ద కాలంగా భారత బ్యాటింగ్ విభాగానికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలే వెన్నెముకగా నిలిచారని, ప్రస్తుతం కూడా వారు జట్టులో విడదీయరాని భాగమని కొనియాడాడు. విభిన్నమైన పిచ్‌లపై, విభిన్న దేశాల్లో వారిద్దరూ చూపించిన ప్రతిభ, వారికి ఉన్న అపారమైన అనుభవం జట్టుకు ఎంతో విలువైనవని గిల్ ప్రశంసల వర్షం కురిపించాడు.