జైల్లో అరాచకం.. 25 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు.. అసలేం జరిగిందంటే..

శ్రీలంకలోని ఓ కారాగారంలో సోమవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఖైదీల మధ్య జరిగిన భీకర ఘర్షణ రక్తపాతానికి దారితీసింది. జైల్లో ఉన్న ఖైదీలు పరస్పరం దాడులు చేసుకోవడంతో దాదాపు 25 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. శ్రీలంక రాజధాని కొలంబోకు ఉత్తరాన ఉన్న నెగోంబో ప్రధాన జైలులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. జైలు లోపల మాదకద్రవ్యాల సరఫరా, లభ్యతకు సంబంధించి ఆదివారం సాయంత్రం రెండు డ్రగ్ ముఠాల మధ్య చిన్న వివాదం మొదలైంది. ఈ గొడవ కాస్తా సోమవారం నాటికి పెద్ద గ్యాంగ్ వార్‌గా మారింది.. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, రిమాండ్ ఖైదీలు రెండు గ్రూపులుగా విడిపోయి రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు.
తుపాకులు లాక్కుని కాల్పులు
సోమవారం నాటికి ఈ అల్లర్లు మరింత ముదిరాయి. జైలు సిబ్బంది పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించగా, కొందరు ఖైదీలు సెక్యూరిటీ గార్డుల నుంచి జైలు తుపాకులను లాక్కుని కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ పరస్పర దాడుల్లో 21 మంది ఖైదీలతో పాటు, నలుగురు జైలు సెక్యూరిటీ గార్డులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి.
జైలు లోపల అల్లర్లు చెలరేగడంతో శ్రీలంక ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ (STF)తో పాటు మిలిటరీని రంగంలోకి దించింది. సైన్యం జైలును తన ఆధీనంలోకి తీసుకుని అల్లర్లను అణచివేసింది. గాయపడిన వంద మందికి పైగా ఖైదీలను ప్రత్యేక బస్సుల్లో స్థానిక నెగోంబో ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండటమే కారణమా?
ఈ ఘోర ఘటనపై శ్రీలంక న్యాయశాఖ మంత్రి హర్షణ నానాయక్కర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాగా, శ్రీలంక జైళ్లలో సామర్థ్యానికి మించి వేలాది మంది ఖైదీలను ఉంచడం వల్లే ఇలాంటి అల్లర్లు త్వరగా నియంత్రణలోకి రావడం లేదని మానవ హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రస్తుతం నెగోంబో జైలులో 2,400 మందికి పైగా ఖైదీలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై జైళ్ల శాఖ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..