July 6, 2026

Andhra Pradesh: ఏపీలో మరో కొత్త పథకం.. వారందరికీ రూ.5 వేలు.. అర్హులు వీళ్లే..

Andhra Pradesh: ఏపీలో మరో కొత్త పథకం.. వారందరికీ రూ.5 వేలు.. అర్హులు వీళ్లే..
Reading Time: 2 minutes
Andhra Pradesh: ఏపీలో మరో కొత్త పథకం.. వారందరికీ రూ.5 వేలు.. అర్హులు వీళ్లే..

“ఇద్దరే ముద్దు… ఒకరైతే ఇంకా ముద్దు” అనే నినాదాలు ఒకప్పుడు వినిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. తగ్గుతున్న జననాల రేటు, పెరుగుతున్న వృద్ధుల జనాభా, భవిష్యత్‌లో శ్రామిక శక్తి కొరత వంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలను కొత్తగా ఆలోచించేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుటుంబ నియంత్రణ స్తానంలో జనాభా నిర్వహణను ప్రోత్సహిస్తూనే.. ఆరోగ్యకరమైన కుటుంబ వ్యవస్థపై అవగాహన పెంచేందుకు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న దంపతులకు నగదు ప్రోత్సాహకం ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు

ప్రతి ఏడాది జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జూలై 11 నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. “పిల్లల మధ్య ఎడం పాటిద్దాం… ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం” అనే నినాదంతో ఈ ప్రచారం కొనసాగనుంది. జిల్లా, మండల స్థాయిలో ర్యాలీలు, సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ముగ్గురు పిల్లలు ఉంటే… రూ.5 వేల బహుమతి

ఈ ప్రచారంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం… ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న దంపతులకు నగదు ప్రోత్సాహకం ఇవ్వడం. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో మూడు జంటలను ఎంపిక చేసి ఒక్కో జంటకు రూ.5 వేల చొప్పున నగదు బహుమతి అందించనున్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 84 జంటలకు ఈ ప్రోత్సాహకం లభించనుంది. అర్హుల సంఖ్య ఎక్కువగా ఉంటే లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.

ఎడం పాటించినా ప్రోత్సాహకమే

మరోవైపు కుటుంబ నియంత్రణ లక్ష్యాన్ని కూడా ప్రభుత్వం విస్మరించలేదు. కాన్పు నుంచి కాన్పుకు మధ్య కనీసం రెండేళ్ల విరామం పాటించిన దంపతులను కూడా ప్రోత్సహించాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాలో ఆరు జంటలకు రూ.5 వేల చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేయనున్నారు. ఈ విభాగంలో కూడా అర్హుల సంఖ్య ఎక్కువగా ఉంటే లక్కీ డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.

ఎందుకు రెండేళ్ల విరామం?

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రెండు కాన్పుల మధ్య కనీసం రెండేళ్ల విరామం ఉంటే తల్లి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. తదుపరి గర్భధారణలో సమస్యలు తగ్గుతాయి. పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండే అవకాశాలు పెరుగుతాయి. ఆరోగ్య శాఖ అంచనాల ప్రకారం, ఈ విధానం పాటిస్తే మాతృ మరణాలు సుమారు 30 శాతం వరకు, శిశు మరణాలు 10 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. అందుకే ఈ అంశంపై ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తున్నారు.

యువతపై ప్రత్యేక దృష్టి

యుక్త వయస్సులో గర్భధారణలు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలు, మండలాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రసవానంతరం అమర్చే గర్భనిరోధక పరికరాలు, “అంతరా” ఇంజెక్షన్, ఇతర కుటుంబ నియంత్రణ పద్ధతులపై మహిళలకు అవగాహన కల్పించనున్నారు. గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు ఆరోగ్య సిబ్బంది ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేపట్టనున్నారు.
అన్ని శాఖల

భాగస్వామ్యంతో ప్రచారం

ఈ కార్యక్రమాన్ని కేవలం ఆరోగ్య శాఖకే పరిమితం చేయకుండా పంచాయతీరాజ్ సంస్థలు, పురపాలక సంస్థలు, మహిళా శిశు సంక్షేమ శాఖ, స్వయం సహాయక సంఘాలు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ సిబ్బంది తదితర శాఖలను భాగస్వామ్యం చేయనున్నారు. ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ ప్రచార కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించే వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి కూడా నగదు పురస్కారాలు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కార్యక్రమాల నిర్వహణ కోసం మొత్తం రూ.56 లక్షలను విడుదల చేసింది ప్రభుత్వం.