Romanchakam Glimpse: సందీప్ వంగా నుంచి ఊహించని ట్విస్ట్.. ‘రోమాంచకం’ గ్లింప్స్ అదిరిపోయింది!

‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి ఇండస్ట్రీ హిట్లతో ఇండియన్ సినిమాను షేక్ చేసిన భద్రకాళీ పిక్చర్స్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ నుండి మరో క్రేజీ ప్రాజెక్ట్ వస్తోంది. ఈసారి ఒక పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా కాకుండా, ఒక బ్యూటిఫుల్ అండ్ వైబ్రేటింగ్ యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘మేమ్ ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్ , అనంతిక సనీల్ కుమార్ హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘రోమాంచకం’ (Romanchakam).
గ్లింప్స్‌తో అంచనాలు రెట్టింపు..
ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్ రెడ్డి వంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా అఫీషియల్ గ్లింప్స్‌ను సోమవారం ( జులై 6, 2026 ) విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన మేకర్స్, ఇప్పుడు గ్లింప్స్‌తో అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు.
ఊహకే అందని ప్రణయ కల్లోలం..
ఈ గ్లింప్స్ చూస్తుంటే ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలబోసిన ఒక పక్కా యూనిక్ లవ్ స్టోరీగా సినిమా ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది. డీవోపీ పవన్ పప్పుల అందించిన పెయింటింగ్ లాంటి విజువల్స్, వాసుకి వైభవ్ కంపోజ్ చేసిన స్వీట్ మెలోడియస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా.. ‘అణువు అణువును ఉర్రూతలూపే ప్రణయ కల్లోలమే రోమాంచకం, ఊహకే అందని ఉవ్వెత్తునెగిసే ఉత్తుంగ తరంగమే రోమాంచకం’..అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే లిరిక్స్ యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ఆ తర్వాత వారి మధ్య ఏర్పడే దూరాన్ని చాలా సున్నితంగా, అంతే ఎమోషనల్‌గా గ్లింప్స్‌లో చూపించారు. సందీప్ రెడ్డి వంగా బ్రాండ్ వెనుక స్ట్రాంగ్ కంటెంట్ ఉంటుందని నమ్మే ఆడియెన్స్‌కు, ఈ ‘రోమాంచకం’ సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ’రోమాంచితం’ మూవీని సెప్టెంబరు 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.