Reading Time: 2 minutes
Pm Modi Meets Norway Pm Store Bilateral Talks Green Strategic Partnership

ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటనలో భాగంగా నార్వేలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా నార్వే ప్రధాని స్టోరే‌తో మోడీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అంతకముందు ఓస్లోలో ప్రధాని మోడీకి నార్వే ప్రధాని ఘన స్వాగతం పలికారు.

మోడీ మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు నార్వే ఇండో-పసిఫిక్ మహాసముద్రాల చొరవలో చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది. రెండు ప్రధాన సముద్ర దేశాలుగా.. సముద్ర ఆర్థిక వ్యవస్థ, సముద్ర భద్రత, సామర్థ్య నిర్మాణం వంటి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి మేము కలిసి పనిచేస్తాం. ఈ రోజు మేము త్రికోణాకార అభివృద్ధి సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. ఏ సమస్యకైనా సైనిక ఘర్షణ పరిష్కారం చూపలేదనే విషయంలో మేమంతా ఏకతాటిపై ఉన్నాం. అది ఉక్రెయిన్‌కు సంబంధించినదైనా లేదా పశ్చిమాసియాకు సంబంధించినదైనా.. ఘర్షణలను త్వరితగతిన నిలిపివేసి, శాంతిని పునరుద్ధరించడమే లక్ష్యంగా సాగే ప్రతి ప్రయత్నానికి మేము మద్దతు ఇస్తాము..ఇస్తూనే ఉంటాము.’’ అని మోడీ తెలిపారు.

‘‘ఈ రోజు మేము భారతదేశం-నార్వే మధ్య సంబంధానికి ‘హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం’ రూపాన్ని ఇస్తున్నాం. స్వచ్ఛ ఇంధనం నుంచి వాతావరణ స్థితిస్థాపకత వరకు.. నీలి ఆర్థిక వ్యవస్థ నుంచి హరిత నౌకా రవాణా వరకు ప్రతి రంగాన్ని విస్తరించిన ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం, భారతదేశ పరిమాణం, వేగం, ప్రతిభను నార్వే సాంకేతికత, మూలధనంతో కలపడం ద్వారా రూపుదిద్దుకుంటోంది. భారతదేశపు ఆర్కిటిక్ పరిశోధనా కేంద్రమైన ‘హిమాద్రి’ కార్యకలాపాలను సులభతరం చేసినందుకు మేము నార్వేకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇస్రో, నార్వేజియన్ అంతరిక్ష సంస్థ మధ్య ఈ రోజు సంతకం అవుతున్న అవగాహన ఒప్పందం. అంతరిక్ష రంగంలో మా సహకారానికి ఒక కొత్త కోణాన్ని జోడిస్తుంది..’’ అని పేర్కొన్నారు.