
కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి సాధించిన విజయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఫలితాలను చారిత్రాత్మక విజయంగా అభివర్ణిస్తూ, పార్టీ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ విజయం సాధారణం కాదని, కష్టపడి సాధించిన గొప్ప ఫలితమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కే.సి. వేణుగోపాల్, దీపా దాస్ మున్షీ నాయకత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. వారి మార్గదర్శకత్వమే ఈ విజయానికి ప్రధాన కారణమని తెలిపారు.
కేరళలో జరిగిన ప్రచారంలో ప్రజలు తనపై చూపిన ప్రేమ, ఆత్మీయతకు రేవంత్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అనుబంధం తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పారు. తెలంగాణ, కేరళ రాష్ట్రాలు ప్రజాస్వామ్య విలువలు, అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాయని రేవంత్ పేర్కొన్నారు. గత దశాబ్దంలో ఎదురైన నిరాశ తర్వాత ఇప్పుడు మంచి భవిష్యత్‌కు బాటలు పడుతున్నాయని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో కేరళ అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఈ విజయం ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమని, భవిష్యత్ రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్
కేరళ విజయంతో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ నెలకొంది. కేరళలో విస్తృత ప్రచారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ముట్టతార రోడ్ షోలో బీజేపీ, కేరళ సీఎం పినరయ్ విజయన్‌పై విరుచుకుపడ్డారు. బీజేపీకి పినరయ్ విజయన్‌కు తేడా లేదన్న రేవంత్.. కేరళ ప్రజలు తెలివైనవారు.. సరైన అభ్యర్థులను ఎన్నుకుంటారంటూ పేర్కొన్నారు. పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధి తీసుకువచ్చేవారికే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. సీఎం ప్రచారం చేసిన స్థానాల్లో భారీ మెజారిటీతో UDF విజయం సాధించడం పట్ల పలువురు సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..