
తెలంగాణ ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త తెలిపింది. వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను రైల్వే బోర్డుకు దక్షిణ మధ్య రైల్వే అందించింది. దీంతో ఈ ప్రాజెక్టులో మరో ముందడుగు పడినట్లు అయింది. దాదాపు 122 కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్ ఉండనుండగా.. దీని నిర్మాణానికి రూ.2,844 కోట్లు ఖర్చు అవుతుందని డీపీఆర్ నివేదికలో సమర్పించింది. వికారాబాద్ నుంచి రైల్వే లైన్ ప్రారంభం కానుండగా.. కర్ణాటక సరిహద్దులోని నారాయణపేట జిల్లా కృష్ణా రైల్వే స్టేషన్‌లో ఇది కలుస్తుంది. డీపీఆర్ సిద్దం కావడంతో ఈ ప్రాజెక్టుపై గత కొన్నేళ్లుగా జరుగుతున్న జాప్యానికి తెర పడినట్లయింది.
గోవాకు ప్రయాణం వేగవంతం
ఈ కొత్త రైల్వే లైన్ పూర్తయితే గోవాకు సులువుగా చేరుకోవచ్చు. అత్యంత వేగంగా గోవాకు వెళ్లే అవకాశం ఉంటుంది. గోవా వెళ్లేవారికి ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గంగా ఉండనుంది. వికారాబాద్ నుంచి రాయచూర్, హుబ్లీ మీదుగా గోవాకు వెళ్లవచ్చన్నమాట. ఈ రైల్వే లైన్ పూర్తయిన ఆర్ధిక రాబడి ఎక్కువగా ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే జోన్ తన నివేదికలో తెలిపింది. రాబడి 10 శాతం కంటే ఎక్కువ ఉన్న రైల్వే లైన్లకు రైల్వేశాఖ ప్రాధాన్యత ఇస్తోంది. ఈ మర్గంలో 10.09 శాతం రాబడి ఉంటుందని రైల్వే అధికారులు అంచనా వేశారు. దీంతో ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణంపై మరో ముందడుగు వేశారు. అయితే ఈ రైల్వే లైన్ కోసం భూసేకరణ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వంమే భరించనుంది. దీంతో రైల్వేశాఖ కూడా ఈ ప్రతిపాదనను అంగీకరించి ప్రాజెక్టుపై స్పీడ్ పెంచింది. ప్రస్తుతం రైల్వే బోర్డులోని ప్రాజెక్ట్ ఎవల్యూషన్ కమిటీ వద్ద ఇది పెండింగ్‌లో ఉంది. ఈ రైల్వే లైన్‌కు అవసరమైతన టెక్నికల్, ఆర్ధిక అంశాలను ఆ కమిటీ పరిశీలిస్తోంది.
త్వరలోనే గ్రీన్ సిగ్నల్
రైల్వే బోర్డ్ నుంచి ఆమోదం లభించాక నిర్మాణ పనులు మొదలుకానున్నాయి. డీపీఆర్ పంపించడంలో త్వరలోనే రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తన్నాయి. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే నారాయణపేట, వికారాబాద్ జిల్లాల అభివృద్దికి మేలు చేకూరనుంది. పర్యాటక రంగానికి ఊతమివ్వడంతో పాటు పారిశ్రామికంగా కొత్త పరిశ్రమలు రానున్నాయి. దీంతో ఆర్ధిక పరంగా రెండు జిల్లాలకు ప్రయోజనం చేకూరనుంది.