Reading Time: < 1 minute
Nbk111 Kajal Aggarwal Replaces Nayanthara Balakrishna Movie

నటసింహం నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో 111వ మైలురాయిగా మలుచుకుంటున్న భారీ ప్రాజెక్టు #NBK111 నుంచి ఒక సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట అనుకున్న ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార స్థానంలోకి ఇప్పుడు కాజల్ అగర్వాల్ వచ్చి చేరింది. ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జై సింహా’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత బాలయ్య-నయన్ కాంబినేషన్ అనగానే ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం నయనతార ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నయనతార హిందీలో సల్మాన్ ఖాన్ సరసన ఒక భారీ చిత్రంలో నటిస్తోంది. దీనివల్ల ఆమె కాల్షీట్లు సర్దుబాటు చేయడం మేకర్స్‌కు కష్టతరంగా మారింది.

ఈ సినిమా కోసం నయనతార దాదాపు 10 కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, ఆమె సినిమాల ప్రమోషన్లలో పాల్గొనదు కూడా. ఈ కారణాల రీత్యా మేకర్స్ ప్రత్యామ్నాయం వైపు మొగ్గు చూపారు. నయనతార ఎగ్జిట్ అవ్వగానే, దర్శకుడు గోపీచంద్ మలినేని టీమ్ వెంటనే కాజల్ అగర్వాల్‌ను సంప్రదించారు. కాజల్ ఈ సినిమా కోసం చాలా తక్కువ పారితోషికానికి అంగీకరించడమే కాకుండా, ప్రమోషన్స్ విషయంలో కూడా పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చిందట. గతంలో బాలయ్యతో కలిసి ‘భగవంత్ కేసరి’లో నటించినప్పటికీ, అందులో కాజల్ పాత్ర విభిన్నంగా ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఆమె ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్‌లో కనిపించబోతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.