Reading Time: < 1 minute
India Permits 100 Percent Fdi Insurance Sector Automatic Route Lic Rules

బీమా కంపెనీలలో ఆటోమేటిక్ రూట్ ద్వారా 100 శాతం FDI కి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనివల్ల విదేశీ కంపెనీలు భారతీయ బీమా సంస్థలలో పూర్తి వాటాను పొందే అవకాశం ఉంటుంది. అయితే.. ఈ పెట్టుబడులు కచ్చితంగా ‘బీమా చట్టం 1938’ కు లోబడి ఉండాలి. అంతే కాకుండా.. IRDAI నుంచి అవసరమైన లైసెన్సులు లేదా ఆమోదాలు పొందాల్సి ఉంటుంది. అయితే భారత ప్రభుత్వానికి చెందిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) విషయంలో మాత్రం పాత నిబంధనలే వర్తిస్తాయి. LICలో విదేశీ పెట్టుబడుల పరిమితి కేవలం 20 శాతానికే పరిమితం చేయబడింది. ఇది ‘LIC చట్టం 1956’ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించబడుతుంది. ఇతర ప్రైవేట్ బీమా కంపెనీలతో పోలిస్తే LICకి ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్ కొనసాగుతుంది.

విదేశీ పెట్టుబడులు పెరిగినప్పటికీ, కంపెనీలపై నియంత్రణ భారతీయ పౌరుల చేతుల్లోనే ఉండేలా కొన్ని కీలక నిబంధనలు విధించారు. బీమా కంపెనీలో ఛైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ (MD), లేదా CEO లలో కనీసం ఒకరు ఖచ్చితంగా భారతీయ నివాసి అయి ఉండాలి. ఇది కీలక నిర్ణయాధికారాల్లో దేశీయ ప్రయోజనాలను కాపాడటానికి సహాయపడుతుంది.

బీమా కంపెనీలతో పాటు.. ఈ రంగంలోని మధ్యవర్తులకు కూడా 100 శాతం FDI వర్తిస్తుంది. ఇందులో ప్రధానంగా.. ఇన్సూరెన్స్ బ్రోకర్లు, రీఇన్సూరెన్స్ బ్రోకర్లు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్లు (TPA), సర్వేయర్లు మరియు లాస్ అసెసర్లు, కార్పొరేట్ ఏజెంట్లు, కన్సల్టెంట్లు ఉంటారు. ఈ మార్పుల వల్ల బీమా రంగంలోకి భారీగా విదేశీ మూలధనం వచ్చే అవకాశం ఉంది. ఇది పోటీని పెంచడమే కాకుండా, కొత్త టెక్నాలజీని తీసుకురావడానికి, దేశవ్యాప్తంగా బీమా వ్యాప్తిని మెరుగుపరచడానికి దోహదపడుతుంది. అదే సమయంలో నియంత్రణ నిబంధనల ద్వారా వినియోగదారుల ప్రయోజనాలను కూడా రక్షించడం జరిగింది.