
సుమారు అయిదున్నర దశాబ్దాల క్రితం ‘తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది’ అంటూ దేశీయ కమ్యూనిస్టుల్లో సాయుధ పంథాకు చారుమజుందార్ బీజంవేశారు. పశ్చిమ బెంగాల్ లోని నక్సల్ బరి అనే గ్రామంలో మొదలైనందున ఈ బాటలో నడిచినవాళ్లకు నక్సలైట్లు అనే పేరు వచ్చింది. అప్పుడు పశ్చిమబెంగాల్ మార్క్సిస్టు పార్టీ పాలన ఉంది. ఆ ప్రభుత్వ నిర్ణయాలు పేదలకు, రైతులకు ఎలాంటి మేలు చేయకపోగా, భూస్వామ్య, పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నాయని విమర్శించినవాళ్లు విడిపోయి సిపిఐ (మార్క్సిస్టు-లెనినిస్టు) అనే కొత్త పార్టీ పెట్టారు. రష్యా, చైనా దేశాల మాదిరిగా ఇండియాలోనూ సాయుధ తిరుగుబాటు ద్వారా పార్లమెంటరీ విధాన పాలనను కూలదోసి కమ్యూనిస్టు రాజ్యాన్ని స్థాపించవచ్చని ఆ పార్టీ అనుకుంది. ఆ ఆలోచన కాలక్రమంగా దేశంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించి ముప్పై ఏళ్లపాటు తన ప్రతాపం చూపించి ఇప్పుడు కొనఊపిరికి వచ్చింది. ముప్పైనుంచి నలభైఏళ్ల సుదీర్ఘ జీవితకాలం తుపాకినిని నమ్ముకున్నవాళ్లు.. ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగిస్తూ.. తుపాకుల వల్ల ఏమి సాధించలేమని ప్రకటిస్తున్నారు. పాలకులకు వ్యతిరేకంగా ఆయుధాలు పట్టుకొన్న ప్రజలు ఏనాటికైనా ఓడిపోవడమే అనే విషయాన్ని గ్రహించేందుకు ఇంతకాలం పట్టింది. తుపాకి గొట్టం సిద్ధాంతం ఇక మూలన పడ్డట్లే.
నిజానికి ఇప్పుడు దేశంలో నక్సలైట్ల కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఆంధ్ర, ఛత్తీస్‌గడ్, ఒడిశా సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో తప్ప వారి ఉనికి మరెక్కడా లేదు. ఒకప్పుడు కొన్ని రాష్ట్రాలను ప్రభావితం చేసిన విప్లవోద్యమం నేడు కొన్ని మారుమూల గ్రామాలకు పరిమితమైంది. వారి కదలికల వల్ల ప్రభుత్వాలకు వచ్చిన నష్టమేమీ లేదు. అయితే కమ్యూనిజానికి, జాతీయవాదానికి ప్రపంచవ్యాప్తంగా పుట్టు వైరముంది. ఎర్రజెండాను చూస్తే కాషాయం భగ్గుమంటుంది. కుంచించుకుపోయిన వారి స్థాన, సంఖ్యా బలం అంచనా వేసినాకే హోం మంత్రి అమిత్ షా తన లక్ష్యాన్ని నిర్ధారించుకొని ఉండవచ్చు. పారిశ్రామికవేత్తల, పెట్టుబడుదారుల కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగేందుకు వారికి అన్ని వేళలా తోడ్పడడం బిజెపి ప్రభుత్వవిధానం. వారు దేశంలోని ఏ భూభాగం కావాలన్నా అప్పగించడానికి అది సిద్ధమే. అడవుల్లో ఉన్న అటవీ ఉత్పత్తులు, ఖనిజ సంపద పరిశ్రమలకు ఆవశ్యకం. పారిశ్రామిక ముడిసరుకుతోపాటు ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే అవకాశానికి ఏమాత్రం ఆటంకం కలగవద్దని గిరిజనాభివృద్ధి పేరిట కేంద్రం అడవుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సిద్ధపడింది. చత్తీస్‌గఢ్‌లోని కనీస సదుపాయాలు లేని ప్రాంతాల్లోకి రహదారులు, విద్యుత్తు, పాఠశాలలు, దవాఖానాలు వచ్చాయని వార్తలు వస్తున్నాయి. ఈ ఏర్పాట్లకు మావోయిస్టులే పరోక్ష కారణంగా చెప్పుకోవాలి. లొంగుబాటు అవకాశం పదేళ్ల ముందే వచ్చి ఉంటే బాగుండేదని ఈ మధ్య లొంగిపోయిన ఓ మావోయిస్టు నేత అన్నారు. 1980 ప్రాంతంలో నక్సలైట్లు గ్రామాల్లోంచి దొరలను తరిమినప్పుడు కూడా వాళ్ళు ఇదే మాట అన్నారు.
పట్టణాల్లో వచ్చి పట్టణ జీవితాన్ని చూసి వారు ఈ నక్సలైట్లు పదేళ్ల ముందొస్తే బాగుండేది కదా అని వాపోయారు. వసతులు లేని పల్లెటూళ్ళ కన్నా పట్టణాల్లో సకల సౌకర్యాలతో సజావుగా సాగే వ్యాపారాలు వీరికెంతో కలిసి వచ్చాయి. కాలం తెచ్చేమార్పులను ముందే ఊహించడం కష్టమే. మాజీ మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాలరావు తన ఆయుధాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు హుషారుగా అప్పగించడాన్ని కొందరు విమర్శించారు. పదేళ్లుగా ఆయన ఎదిరిచూస్తున్న సమయం వచ్చిందన్న ఆనందమే ఆయన నవ్వులో ఉంది. 2014 లోనే సాయుధ పోరాటాన్ని విరమిద్దామనే చర్చ పార్టీలో వచ్చిందని, భద్రతా దృష్ట్యా ఒకరికొకరు కలిసే అవకాశాలు లేనందున, ఏకాభిప్రాయ సాధనలో ఎంతో కాలహరణ జరిగింది అని మల్లోజుల ఓ చోట అన్నారు. ఆ తర్వాత కొనసాగిన, కొనసాగుతున్న మావోయిస్టుల లొంగుబాట్లను చూసాక ఆయన తీసుకున్న నిర్ణయంలో, అన్న మాటల్లోని వాస్తవం అర్థమవుతుంది. విశాల ప్రజాస్వామిక దేశాన్ని ఆయుధాలతో పోరాడి, ఓడించి, పాలించడం అసాధ్యమే అని కాలమే తీర్పు చెప్పింది. తమ తర్వాత పోరాటం ఆగదు, కొనసాగుతుంది.
తమ త్యాగాలు వృథా కావు అనే నమ్మకం సన్నగిల్లింది. అందుకే చిన్న పెద్ద అనే తేడా లేకుండా తలలు వంచుతున్నారు. నక్సలైటు బతుకంటే సింహంపై స్వారీ, దిగితే తినేస్తుంది. అలాంటి పరిస్థితి నుండి ప్రభుత్వ సహకారంతో లొంగిపోయి బ్యాంక్ చెక్ తీసుకోని ఇంటికి వెళ్లడమంటే కొత్త జన్మ లభించినట్లే. ఓ రకంగా మావోయిస్టులు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అమిత్ షా మరణమో, శరణమో తేల్చుకోమన్నారు. జరిగిన ఆలస్యాన్ని, ప్రాణనష్టాన్ని చూస్తుంటే కేంద్రం ఇచ్చిన వెసులుబాటును మావోయిస్టులే సరిగ్గా వాడుకోనట్లనిపిస్తుంది. జనవరి 2024లో మొదలైన ఆపరేషన్ కగార్ భారీ ప్రభుత్వ బలగాలతో ముందుకు సాగింది. ఆయుధాలను వదిలేస్తే ప్రాణభయం ఉండదు అని మైకుల్లో ప్రచారం కూడా జరిగింది.
ఆయుధాలు అప్పగించమని, శాంతి చర్చలు జరగాలని మావోయిస్టుల కొంత బెట్టు చేశారు. ఆ తరువాత తమ వైపు నుంచి కాల్పులు ఉండవని ప్రకటించారు. ప్రభుత్వ బలగాలు మాత్రం గుట్టల్ని జల్లెడ పట్టడం ఆపలేదు. లొంగిపోయిన వారిని వదిలేస్తూ తుపాకితో అడవిలో కనబడ్డ వారిని హతమార్చడమే వాటి పనిగా సాగింది. మల్లోజుల నుండి దేవ్ జి వరకు కొనసాగిన పెద్ద తలల లొంగుబాటు మధ్య సుమారు వేయి మంది దాకా ప్రాణాలు ఇలా కాపాడుకున్నట్లే. ప్రభుత్వాలు వీరికి పునరావాసం కల్పించడం గొప్ప ఔదార్యమే. సాయుధ పోరు సాగదని తెలిసి కూడా మరో దారి లేక అడవుల్లో బతుకుతూ ఉన్నవారిని ఆపరేషన్ కగార్ కాపాడినట్లే. అమిత్ షా మావోయిస్టుల భక్షకుడిగానే కాకుండా రక్షకుడిగా కూడా పేరు సంపాదించారు. ఇక మిగిలింది గణపతి. అమిత్ షా డెడ్ లైన్ లోపు ఆయన ప్రభుత్వం ముందుకు వస్తారా లేక మార్చి, 31ని దాటేస్తారా? పార్టీ జెండాను దించకుండా రహస్యంగానే తల ఎత్తుకొని బతుకుతారా? పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకు పోయినందున ప్రభుత్వానికి ఆపరేషన్ గణపతి మాత్రం అవసరం పడదు.
బి.నర్సన్, 94401 28169