Reading Time: 2 minutes
Up Newlywed Vanishes From Bus After Sending Husband To Buy Pakoras Family Suspects She Fled With Lover

ఉత్తరప్రదేశ్‌లో ఒక వింత ఘటన వెలుగులోకి వచ్చింది. పకోడీలు కావాలని భర్తను షాపుకు పంపిన ఓ నవవధువు.. అతడు తిరిగి వచ్చేలోపే బస్టాండ్ నుంచి మాయమైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ వింత మిస్టరీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అసలేం జరిగింది..?
రాంపూర్ జిల్లాకు చెందిన రిమ్జిమ్ (18) అనే యువతికి అమ్రోహా జిల్లాకు చెందిన పీతమ్ సింగ్‌తో 2025, డిసెంబర్ 1న వివాహం జరిగింది. పెళ్లై మూడు నెలలు కూడా గడవకముందే ఈ విషాదం చోటుచేసుకుంది. హోలీ పండుగ కోసం వారం రోజుల క్రితం రిమ్జిమ్ పుట్టింటికి వెళ్లింది. పండుగ అయిపోయాక.. తన భార్యను తిరిగి ఇంటికి తీసుకెళ్లడానికి పీతమ్ సింగ్ సోమవారం (మార్చి 9) ఆమె గ్రామానికి వెళ్ళాడు.

వీరిద్దరూ కలిసి మొరాదాబాద్ వెళ్లేందుకు బిలారీ బస్టాండ్‌లో రోడ్‌వేస్ బస్సు ఎక్కారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో బస్సు ఓ బస్టాండ్‌లో ఆగింది. ఆ సమయంలో తనకు పకోడీలు తినాలని ఉందని, దాహం వేస్తోందని భర్తతో రిమ్జిమ్ చెప్పింది. భార్య కోరిక మేరకు పీతమ్ సింగ్ పక్కనే ఉన్న క్యాంటీన్‌కు పకోడీలు, నీళ్లు తీసుకురావడానికి వెళ్ళాడు.

Also Read:TG Crop Loan: పంట రుణాల పరిమితి ఖరారు.. ఒక్క ఎకరాకు ఎంత రుణం ఇస్తారంటే..

తిరిగి వచ్చేసరికి ఖాళీ సీటు
కొద్దిసేపటి తర్వాత పీతమ్ సింగ్ పకోడీలతో బస్సు దగ్గరకు వచ్చి చూసేసరికి, సీట్లో ఉండాల్సిన భార్య కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోయింది. ఆమె ఫోన్‌కు కాల్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చింది. బస్సులోని ఇతర ప్రయాణికులను అడగగా.. ఆమె ఫోన్ మాట్లాడుతూ బస్సు దిగి వెళ్లిపోయిందని వారు చెప్పారు.

Also Read:Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ సరికొత్త రికార్డు

పోలీసులకు ఫిర్యాదు..
చాలాసేపు బస్టాండ్ అంతా వెతికిన పీతమ్ సింగ్, చివరకు పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య అదే గ్రామానికి చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తితో వెళ్లిపోయి ఉండవచ్చని అతను తన ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశాడు. రిమ్జిమ్ ఇంటర్మీడియట్ వరకు చదువుకుందని.. ఆమె ఎత్తు 5 అడుగుల 3 అంగుళాలు ఉంటుందని వివరించాడు.

తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని, ఆమె ఇలా చేస్తుందని తాము అస్సలు ఊహించలేదని భర్త తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. సబ్ ఇన్ స్పెక్టర్ వినీత్ కుమార్ నేతృత్వంలో పోలీసులు ఆ నవవధువు కోసం గాలిస్తున్నారు.