Reading Time: 2 minutes

వేసవి కాలం వచ్చిందంటే చాలు రోడ్ల పక్కన ఎక్కడ చూసినా ఎర్రటి పుచ్చకాయలు కనిపిస్తాయి. అయితే ఈ మధ్య మార్కెట్లో పసుపు రంగు పుచ్చకాయలు కూడా సందడి చేస్తున్నాయి. చాలామంది ఇవి హైబ్రిడ్ ఏమో అని భయపడుతుంటారు, కానీ నిజానికి ఇవి కూడా ప్రకృతి సిద్ధంగా లభించేవే! మరి ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది? ఏ రంగు కాయ తింటే మన బాడీకి ఎక్కువ లాభమో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

రెండు రంగుల వెనుక ఉన్న రహస్యం: ఎరుపు పుచ్చకాయకు ఆ రంగు రావడానికి అందులో ఉండే ‘లైకోపీన్’ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కారణం. అదే పసుపు పుచ్చకాయలో లైకోపీన్ ఉండదు దానికి బదులుగా ‘బీటా కెరోటిన్’ అనే పోషకం ఉంటుంది. క్యారెట్లకు పసుపు రంగును ఇచ్చే ఈ బీటా కెరోటిన్ వల్లే ఈ పుచ్చకాయలు ఆ రంగులో మెరిసిపోతుంటాయి. ఈ రెండు కూడా మన శరీరానికి ఎంతో అవసరమైనవే.

Yellow vs Red Watermelon: Which Is Healthier in Summer?
Yellow vs Red Watermelon: Which Is Healthier in Summer?

ఎరుపు పుచ్చకాయ – గుండెకు శ్రీరామరక్ష: మనం రెగ్యులర్‌గా తినే ఎర్రటి పుచ్చకాయలో లైకోపీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె సంబంధిత సమస్యలను దరిచేరనీయదు. అలాగే ఎండ వల్ల చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇక ఇందులో ఉండే సిట్రుల్లైన్ అనే అమైనో ఆమ్లం రక్తపోటును అదుపులో ఉంచడంతో పాటు, వ్యాయామం చేసిన తర్వాత వచ్చే కండరాల నొప్పులను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది.

పసుపు పుచ్చకాయ – కంటికి మెరుపు: పసుపు రంగు పుచ్చకాయను ఇప్పుడిప్పుడే మన దగ్గర ‘ఎడారి రాజు’ అని పిలుస్తున్నారు. ఇందులో విటమిన్-ఎ (బీటా కెరోటిన్ రూపంలో) పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా, శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇక రుచిలో కూడా ఇది ఎరుపు కాయ కంటే కొంచెం తియ్యగా, తేనె వంటి రుచిని కలిగి ఉంటుంది. చర్మం నిగనిగలాడాలంటే పసుపు పుచ్చకాయ బెస్ట్ ఛాయిస్.

రెండింటిలో ఏది బెస్ట్?: నిజానికి ఈ రెండింటిలో 90% పైగా నీటి శాతం ఉంటుంది. కాబట్టి డీహైడ్రేషన్ సమస్యకు రెండు కూడా సమానంగా పనిచేస్తాయి. మీరు గుండె ఆరోగ్యం మరియు యాంటీఆక్సిడెంట్స్ కోసం చూస్తుంటే ఎరుపు రంగును, కంటి ఆరోగ్యం మరియు విటమిన్-ఎ కోసం చూస్తుంటే పసుపు రంగును ఎంచుకోవచ్చు. ఇక వీలైతే మార్చి మార్చి రెండు రకాలను తీసుకోవడం వల్ల అన్ని రకాల పోషకాలు మీ సొంతమవుతాయి.

పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగకూడదని పెద్దలు చెబుతుంటారు. అలాగే రాత్రిపూట పుచ్చకాయను అతిగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి పగటిపూట తీసుకోవడమే ఉత్తమం.

The post వేసవిలో పుచ్చకాయ పసుపు ? ఎరుపు కాయా? ఆరోగ్యానికి ఏది బెస్ట్ తెలుసా! appeared first on Manalokam – Latest Telugu News & Updates.