Reading Time: 2 minutes
Cm Chandrababu Announces Annadata Sukhibhava Funds 2 5 Lakh House Warmings As 2026 Ugadi Gift

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 6వ జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పరిపాలన సహా పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. సమావేశాన్ని ప్రారంభిస్తూ సీఎం చంద్రబాబు మాట్లాడారు.

‘కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ముఖ్యమైన విషయాలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఆరో కలెక్టర్ల సమావేశం. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండింటిపై సమాన దృష్టి పెట్టుతూ ప్రజలకు గుడ్ గవర్నెన్స్ అందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ నిర్ణయాలు దీర్ఘకాలిక ఫలితాలను ఇస్తాయి, అవి పాజిటివ్ లేదా నెగెటివ్‌గా ఉండవచ్చు. రాష్ట్ర పరిపాలనను మెరుగుపరచేందుకు ప్రభుత్వం రూపొందించిన 10 ముఖ్య సూత్రాల ఆధారంగా సుపరిపాలనపై అధికారులు దృష్టి పెట్టాలి. వర్చువల్, ఫిజికల్ వర్క్ రెండింటినీ సమన్వయంతో నిర్వహించాల్సిన అవసరం ఉంది. నేను, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అన్ని అంశాలపై సమగ్రంగా పర్యవేక్షణ చేస్తున్నాము’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

Also Read: Jasprit Bumrah Records: ‘వన్స్ ఇన్ ఏ జనరేషన్ బౌలర్’.. మరీ ఇన్ని అరుదైన రికార్డులా బుమ్రా?

‘ఇవాళ, రేపు అన్ని విభాగాలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. జిల్లా స్థాయిలో అధికారులు క్షేత్ర స్థాయిలో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించాలి. నేను సుదీర్ఘ ఉపన్యాసాలు ఇవ్వను, ముఖ్య విషయాలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడమే నా లక్ష్యం. సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాము. ఈ నెల 13వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. అలాగే ఉగాది పండుగ సందర్భంగా 2 లక్షల 50 వేల ఇళ్లకు గృహ ప్రవేశాలు నిర్వహిస్తాం. అన్నదాత సుఖీభవ, గృహ ప్రవేశాలు ఉగాది కానుకలుగా ప్రజలకు అందిస్తాం’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.

అదే విధంగా విద్యుత్ రంగంలో ట్రూ డౌన్ చార్జీలను విధించి విద్యుత్ చార్జీలను తగ్గించగలిగామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా వినియోగదారులకు ప్రత్యక్ష లాభం కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. రాష్ట్రంలో సమర్థవంతమైన పరిపాలన కోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు.