మీ దగ్గర పాత మ్యాట్రెస్‌లు, సోఫాలు ఉన్నాయా? ..జీహెచ్‌ఎంసీ ఫ్రీ డోర్‌స్టెప్ పికప్ సర్వీస్ బుక్ చేసుకోండిలా!

హైదరాబాద్ నగర ప్రజలకు జీహెచ్ఎంసీ గుడ్ న్యూస్. ఇంట్లో పనికిరాని పాత మ్యాట్రెస్‌లు, సోఫాలు, విరిగిపోయిన ఫర్నిచర్ వంటి భారీ వ్యర్థాలను వదిలించుకోవడం ఇకపై చాలా ఈజీ.ఎందుకంటే ఇలాంటి భారీ వ్యర్థాల కోసం జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా డోర్‌స్టెప్ పికప్ సేవను ప్రారంభించింది.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని 6 జోన్లలో ఈ సేవ పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. జీహెచ్‌ఎంసీ విడుదల చేసిన ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, మీ పికప్ స్లాట్‌ను సులభంగా బుక్ చేసుకోవచ్చు.మీరు బుక్ చేసుకున్న వెంటనే, జీహెచ్‌ఎంసీ సిబ్బంది నేరుగా మీ ఇంటి వద్దకే వచ్చి ఆ పాత మ్యాట్రెస్‌లను, ఫర్నిచర్‌ను సేకరిస్తారు.ఇలా సేకరించిన వ్యర్థాలను జీహెచ్‌ఎంసీ పారేయకుండా, పర్యావరణానికి హాని కలగని రీతిలో శాస్త్రీయ పద్ధతిలో రీసైక్లింగ్‌కు పంపించనుంది.
అందుకే.. పాత మ్యాట్రెస్‌లు, పాడుబడిన భారీ ఫర్నిచర్‌ను రోడ్లపై, ఖాళీ ప్లాట్లలో లేదా నాలాల్లో పడేసి నగరాన్ని కలుషితం చేయవద్దని జీహెచ్‌ఎంసీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకుని, స్వచ్ఛమైన, హరిత హైదరాబాద్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జీహెచ్‌ఎంసీ పిలుపునిచ్చింది.