కామారెడ్డిలో రష్యా వీసాల పేరుతో ఘరానా మోసం.. కేటుగాడు అరెస్ట్

విదేశాల్లో ఉద్యోగాల పేరిట అమాయక యువకులను ముంచుతున్న అంతర్ జిల్లా కేటుగాడి ఆట కట్టించారు కామారెడ్డి పోలీసులు. రష్యా వర్క్ పర్మిట్ వీసాల పేరుతో నిరుద్యోగులను నమ్మించి, లక్షలాది రూపాయలు వసూలు చేసిన భారీ మోసాన్ని పోలీసులు ఛేదించారు.
ఈ ఘరానా మోసానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం మైసమ్మ చెరువు తండాకు చెందిన కొందరు యువకులకు రష్యాలో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు నిందితుడు. వర్క్ పర్మిట్ వీసాల పేరుతో బాధితుల నుంచి ఏకంగా రూ.9.37 లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత వారికి నకిలీ వర్క్ పర్మిట్ వీసాలు ఇచ్చి నిలువునా ముంచేశాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది.
బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కామారెడ్డి పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ అంతర్ జిల్లా మోసాలకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడు గలేటి వెంకటయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ వెల్లడించారు. నిందితుడి నుంచి రూ.45 వేల నగదు, 3 పాస్‌పోర్టులు, ఒక బైక్, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విదేశీ ఉద్యోగాల పేరుతో ఇంటర్నెట్‌లోనో, మధ్యవర్తుల ద్వారానో వచ్చే ఇలాంటి నకిలీ ఆఫర్లను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని, ఏదైనా ఏజెన్సీ ద్వారా వెళ్లేటప్పుడు పూర్తి వివరాలు సరిచూసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.