Reading Time: < 1 minute
Vijayawada Haleem Stalls Notice Town Planning Orders Removal Of Non Compliant Stalls During Ramadan

Notice to Haleem Stalls: రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన హలీమ్ స్టాల్స్‌కు షాకిచ్చారు అధికారులు.. విజయవాడలో ఏర్పాటు చేసిన హలీమ్‌ స్టాల్స్‌పై టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు ప్రారంభించారు. ముఖ్యంగా పంజా సెంటర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన హలీమ్ స్టాల్స్‌కు నోటీసులు జారీ చేశారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు గుర్తించిన అధికారులు, సంబంధిత వ్యాపారులకు నోటీసులు అందజేశారు. రేపు ఉదయం వరకు నిబంధనలకు అనుగుణంగా స్టాల్స్‌ను సరిచేయాలని లేదా పూర్తిగా తొలగించాలని ఆదేశించారు.

Read Also: AP High Court: యూనివర్సిటీల్లో పదవీ విరమణ వయస్సు కేసు.. వివక్షపూరితమేనన్న హైకోర్టు..

రంజాన్ సందర్భంగా హలీమ్ విక్రయాలు పెరిగిన నేపథ్యంలో, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటం తమ బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. అనుమతి ఇచ్చిన పరిమితి దాటి స్టాల్స్‌ను విస్తరించరాదని స్పష్టం చేశారు. అనుమతించిన పరిధిలోనే వ్యాపారం చేయాలని, లేకపోతే వెంటనే స్టాల్స్ ఖాళీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికే నిర్ణయించిన పరిమితిని దాటి రోడ్లపైకి లేదా పాదచారుల మార్గాల్లోకి వచ్చిన స్టాల్స్‌ను టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగిస్తున్నట్లు సమాచారం. ప్రజా రవాణా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఈ పరిణామంతో పంజా సెంటర్ ప్రాంతంలో హలీమ్ స్టాల్స్ నిర్వహణపై స్పష్టమైన నిబంధనలు అమలులోకి రానున్నాయి.