Reading Time: < 1 minute

ఢిల్లీలో మళ్లీ ఐసా నిరసనలు.. రెండోరోజూ నేహా బోరా, ప్రశాంత్ భూషణ్ ర్యాలీ

Caption of Image.
  • 150 మంది నిరసనకారుల అరెస్ట్  

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఐసా) ఆధ్వర్యంలో వరుసగా రెండో రోజూ నిరసనలు వెల్లువెత్తాయి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్​తో శనివారం పటేల్ చౌక్ నుంచి జంతర్​ మంతర్​ వైపు నిరసన ప్రదర్శనగా వెళ్తున్న ఐసా ప్రెసిడెంట్ నేహా బోరా, కార్యకర్త యోగేంద్ర యాదవ్, సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్​తో సహా సుమారు150 మంది నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. 

అనుమతి లేకుండా ర్యాలీ తీసినందుకు గాను వారందరినీ అదుపులోకి తీసుకున్నట్టు ఓ పోలీస్ ఆఫీసర్ వెల్లడించారు. నిరసన ప్రదర్శనలో సీనియర్ అడ్వకేట్లు కపిల్ సిబల్, నిత్య రామకృష్ణన్, పల్లవ్ సిసోడియా కూడా పాల్గొన్నారు. మధ్యాహ్నం పటేల్ చౌక్​లో గుమిగూడిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు. జంతర్​ మంతర్​ దారితీసే మార్గాల్లో బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు అనేక ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని మోహరించారు. 

ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి నేహా బోరా పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, మరో అధికారి ఆమెను దూషించారని ఐసా సభ్యులు ఆరోపించారు. కాగా, శుక్రవారం జంతర్​ మంతర్​లో జరిగిన నిరసనల్లోనూ నేహా బోరా, తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత విడిచిపెట్టారు. శనివారం మధ్యాహ్నం 1 గంటకు మళ్లీ జంతర్​ మంతర్​కు చేరుకుని జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్​తో పాటు సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా నిరసనలను కొనసాగించాలని నేహా బోరా పిలుపునివ్వడంతో కార్యకర్తలు పటేల్ చౌక్​కు తరలిరాగా, పోలీసులు అడ్డుకున్నారు.

©️ VIL Media Pvt Ltd.