
హైదరాబాద్, అక్టోబర్ 4: నగరంలోని చారిత్రాత్మక పాతబస్తీలో అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మక్కా మస్జిద్, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలు మోహరించడంతో స్థానికులు కొంతసేపు ఆందోళనకు గురయ్యారు. అయితే ఇది ఎలాంటి నిజమైన ప్రమాదం కాదని.. అత్యవసర పరిస్థితుల్లో భద్రతా బలగాల సన్నద్ధతను పరీక్షించేందుకు నిర్వహించిన మాక్ డ్రిల్ అని అధికారులు స్పష్టం చేశారు. ఉగ్రవాద దాడులు లేదా ఇతర క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు భద్రతా బలగాలు ఎంత వేగంగా స్పందించగలవు? ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలి? వివిధ విభాగాల మధ్య సమన్వయం ఎలా ఉండాలి? వంటి అంశాలను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ఈ విన్యాసాలు నిర్వహించారు.
తెలంగాణ కౌంటర్ టెర్రరిజమ్ విభాగానికి చెందిన ఆక్టోపస్ (OCTOPUS) బృందంతో పాటు పలు ప్రధాన భద్రతా విభాగాలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రత్యేక బృందాలు మాక్ డ్రిల్‌లో పాల్గొన్నాయి. ఒకవేళ ఉగ్రవాద దాడి లేదా ఇతర తీవ్రమైన అత్యవసర పరిస్థితి తలెత్తితే.. భద్రతా బలగాలు తక్కువ సమయంలో సంఘటనా స్థలానికి చేరుకోవడం, పరిస్థితిని అదుపులోకి తీసుకోవడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలను ఎలా చేపట్టాలనే దానిపై సిబ్బంది సన్నద్ధతను అధికారులు పరిశీలించారు. అలాగే వివిధ భద్రతా విభాగాల మధ్య సమాచార మార్పిడి, సమన్వయం, సహాయక చర్యల నిర్వహణ వంటి అంశాలను కూడా ఈ మాక్ డ్రిల్‌లో పరీక్షించినట్లు తెలుస్తోంది.
రాత్రి వేళ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా భద్రతా బలగాల కదలికలు కనిపించడంతో పాతబస్తీ పరిసరాల్లో కొంతసేపు ఉత్కంఠ నెలకొంది. మక్కా మస్జిద్, చార్మినార్ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో సిబ్బంది కనిపించడంతో స్థానికులు ఏం జరుగుతోందోనని ఆందోళన చెందారు. అయితే కొద్దిసేపటికే ఇది భద్రతా సన్నద్ధతను పరీక్షించేందుకు నిర్వహించిన మాక్ డ్రిల్ మాత్రమేనని స్పష్టత రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. దేశ భద్రతకు సంబంధించిన అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడంతో పాటు.. వివిధ భద్రతా విభాగాలు సమన్వయంతో పనిచేసే సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడమే ఈ విన్యాసాల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ప్రజల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.