
- ‘ప్రజాబాట–బస్తీబాట’తో రోజుకు సగటున 408 సమస్యల గుర్తింపు
- స్పాట్లోనే సమస్యలను పరిష్కరించిన విద్యుత్ సిబ్బంది
- సదరన్ డిస్కమ్ పరిధి వివరాలు ప్రకటించిన సీఎండీ జితేశ్ వి పాటిల్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ప్రజాబాట–బస్తీబాట కార్యక్రమంతో గడిచిన ఆరు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 73,457 విద్యుత్ సమస్యలను గుర్తించి పరిష్కరించారు. వీటిలో కొన్ని నెలలు, ఏండ్లు పరిష్కారానికి నోచుకోని సమస్యలు కూడా ఉన్నాయి. సదరన్ డిస్కమ్ పరిధిలో విద్యుత్ శాఖ సిబ్బంది ప్రతి నిత్యం ప్రజలతో మమేకమవుతూ గ్రామాలు, బస్తీలు, కాలనీలలో పర్యటిస్తూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వీటిని పరిష్కరించినట్టుగా డిస్కమ్ సీఎండీ జితేశ్ వి పాటిల్ శనివారం ప్రకటించారు. రోజుకు సగటున 408 సమస్యలను గుర్తించడంతో పాటు విద్యుత్ సిబ్బంది స్పాట్లోనే పరిష్కరించినట్టు ఆయన తెలిపారు.
వారానికి రెండు రోజులు ఫీల్డ్‌లో పర్యటన
విద్యుత్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం, వినియోగదారుల సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి తక్షణ పరిష్కారం అందించడం లక్ష్యంగా సర్కారు ‘ప్రజాబాట – బస్తీబాట’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతి మంగళ, గురువారం ఎస్పీడీసీఎల్ (సదరన్ డిస్కమ్) పరిధిలోని సీఎండీ, డైరెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లతో పాటు కిందిస్థాయి సిబ్బంది, అధికారులు నేరుగా ప్రజలతో మమేకమవుతూ గ్రామాలు, బస్తీలు, కాలనీలలో పర్యటించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సూచనలను వెంటనే పరిశీలించి పరిష్కార చర్యలు చేపట్టారు.