
Asaduddin Owaisi: ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించడానికి ఫారమ్-7 దరఖాస్తుల్ని దుర్వినియోగం చేస్తున్నారని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. బీజేపీ, సంఘ్ పరివార్‌కు చెందిన వారు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫ్రింట్ చేసిన ఫారమ్-7 దరఖాస్తుల్లో తొలగించాల్సిన పేర్లు, ఓటర్ల వివరాలు ఉంటున్నాయని అన్నారు.
ఇది నిజంగా జరుగుతున్నట్లైతే పూర్తిగా తప్పని, ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారులకు సైతం ఈ అంశంపై సమాచారం ఇస్తున్నామని ఓవైసీ తెలిపారు. తప్పుడు ఫారమ్-7 దరఖాస్తుల్ని అప్లై చేస్తున్నట్లయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ వ్యవహారం ఇలాగే కొనసాగితే ఢిల్లీలో జంతర్ మంతర్‌లో జరిగిన నిరసన కన్నా పెద్ద ఎత్తున హైదరాబాద్ రోడ్లు, వీధుల్లో ఆందోళన జరుగుతాయని, మీకు చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుందని, మజ్లిస్ మౌనంగా ఉండదని ఓవైసీ హెచ్చరించారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుతూ.. తాము ఇతర పార్టీలతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. యూపీలో బీజేపీ మూడోసారి అధికారంలోక రావడం తమకు ఇష్టం లేదని, దీనిని నివారించేందుకు తాము పొత్తుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. గతంలో బీహార్‌లో మా నలుగురు ఎమ్మెల్యేలను ఆర్జేడీ కలుపుకుందని, మేము ఇటీవల ఎన్నికల్లో ఆరు సీట్లు మాత్రమే అడిగామని చెప్పారు. మళ్లీ పోటీ చేస్తే ప్రజలకు మమ్మల్ని 5 సీట్లలో గెలిపించారని ఓవైసీ చెప్పారు. శివసేన చీలిపోయినప్పుడు దానిని ప్రజాస్వామ్య హత్యగా చెప్పినవారు, మా ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.