Reading Time: 2 minutes
Shreyas Iyer On India Vs Pakistan Result Pak Batters Scared Me Asian Games 2026 Gold Medal

Shreyas Iyer Happy About Team India Win Gold Medal: ఏషియన్ గేమ్స్‌ 2026 పురుషుల క్రికెట్‌లో భారత్ సత్తా చాటింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి భారత్‌ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శనివారం ఉదయం నిస్షిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో జరిగిన ఫైనల్లో భారత్ 19 పరుగుల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అనంతరం 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 192 పరుగులకే పరిమితమైంది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ఈ విజయాన్ని వర్ణించడానికి ‘ఎక్స్టాటిక్’ అనే పదమే సరిపోతుందని చెప్పాడు. ఓ సమయంలో పాక్ బ్యాటర్లు మంచి ఊపులో కనిపించారని, అప్పుడు మనసులో ఎదో మూలన గోల్డ్ మెడల్ మనకేనా? అనే సందేహం కలిగిందని చెప్పాడు. కీలక సమయంలో శివమ్ దూబే వికెట్స్ పడగొట్టి రేసులోకి తెచ్చాడని శ్రేయస్ చెప్పాడు.

ఎలాంటి కారణాలు చెప్పలేదు:

ఫైనల్ మ్యాచ్‌లో ప్రతి ఒక్క ఆటగాడు తమ వంతు పాత్ర పోషించడమే విజయానికి ప్రధాన కారణమని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. ‘ఒక పదంలో చెప్పాలంటే.. నాకు చాలా ఆనందంగా ఉంది. మేము జపాన్‌కు వచ్చిన రోజు నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. దాదాపు వారం రోజుల పాటు సరిగ్గా ప్రాక్టీస్ చేయలేకపోయాం. అయినప్పటికీ మా ఆటగాళ్లు తమను తాము సిద్ధం చేసుకున్న తీరు, అందుబాటులో ఉన్న సమయంలో శిక్షణ కొనసాగించిన విధానం అద్భుతం. ఎవరూ ఫిర్యాదు చేయలేదు, ఎలాంటి కారణాలు చెప్పలేదు. అదే ఒక ఛాంపియన్ జట్టుకు ఉండాల్సిన లక్షణం. ఈరోజు మా ప్రదర్శన దానికి ప్రతిబింబం’ అని శ్రేయస్ పేర్కొన్నాడు.

శివమ్ దూబే అద్భుతం:
‘పాకిస్థాన్ బ్యాటర్లు ఒక దశలో చాలా బాగా పరుగులు చేశారు. వారికి మంచి ఊపు వచ్చింది. ఆ సమయంలో కాస్త టెన్షన్ పడ్డాను. అయితే నేను ముందుగా ఐదో బౌలర్ ఓవర్‌ను పూర్తి చేయాలని అనుకున్నాను. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్ వంటి ప్రధాన బౌలర్లు బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే వారి ఓవర్లను సరైన సమయంలో ఉపయోగించేందుకు ప్రయత్నించాను. ముఖ్యంగా రన్‌రేట్ 13-14 పరుగుల స్థాయిలో ఉన్నప్పుడు బ్యాటర్లు దూకుడుగా ఆడతారని మాకు తెలుసు. అలాంటి సమయంలో ఒక్క వికెట్ పడితే మ్యాచ్ గమనమే మారిపోతుంది. సరిగ్గా అదే జరిగింది. అయూబ్ వికెట్ కీలకంగా మారింది. ఆ వికెట్‌తో మ్యాచ్‌ మళ్లీ మా వైపు మళ్లింది. శివమ్ దూబే అద్భుతంగా బంతులు వేశాడు’ అని సర్పంచ్ సాబ్ ప్రశంసించాడు.

ప్రతి ప్లేయర్ కష్టపడ్డాడు:
‘ఫైనల్‌లో ఆడుతున్నప్పుడు ప్రతి ఒక్క ఆటగాడు ముందుకొచ్చి తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరుకుంటాం. ఈరోజు అదే జరిగింది. అభిషేక్ శర్మ మాకు మంచి ఆరంభాన్ని అందించాడు. ఆ తర్వాత తిలక్ వర్మ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ముగించాడు. బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్ బాధ్యత తీసుకున్నాడు. అక్షర్ పటేల్ ఎప్పటిలాగే అద్భుతంగా రాణించాడు. జస్ప్రీత్ బుమ్రా ఏం చేయగలడో మనందరికీ తెలుసు. శివమ్ దూబే కీలక సమయంలో రెండు వికెట్స్ తీశాడు. టోర్నీలో ప్రతి ప్లేయర్ కష్టపడ్డాడు. ఈ విజయంకు కారణం సమష్టి ప్రదర్శన. మొత్తంగా చెప్పాలంటే ఇది సంపూర్ణ విజయం’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

ఎంజాయ్ చేస్తాం:
‘నాకు చాలా సంతోషంగా ఉంది. మేమంతా హోటల్‌కు త్వరగా వెళ్లాలని ఎదురుచూస్తున్నాం. ఇప్పటికే మైదానంలో చాలా సమయం గడిపాం. ఈ రాత్రి ఏం చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. చూద్దాం.. పరిస్థితిని బట్టి నిర్ణయించుకుంటాం. ఎంజాయ్ చేస్తాం. గోల్డ్ మెడల్ దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. టీమిండియాకు సారథ్యం వహించడమే గొప్ప. అందులోనూ బంగారు పతకం అంటే ఇంకా కిక్కు ఉంటుంది. ఆ దేవుడికి కృతజ్ఞతలు. ఇలాంటి విజయాలు ఇంకా సాయించాని కోరుకుంటున్నా’ అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఫైనల్‌లో శ్రేయస్ 24 బంతుల్లో 21 రన్స్ చేశాడు.