
- రైతులు తక్కువ నీరు అవసరమయ్యే పంటల వైపు మళ్లాలి: మంత్రి తుమ్మల
- ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో యాసంగి విత్తన పంపిణీ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యత తగ్గే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో యాసంగిలో రైతులు పప్పుధాన్యాలు, నూనెగింజల పంటల వైపు మళ్లాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులకు అనుగుణంగా పంటలను ఎంచుకోవాలని కోరారు. శనివారం నిర్వహించిన ‘రైతు నేస్తం’ 109వ ఎపిసోడ్‌లో మంత్రి పాల్గొని రబీ 2026–-27 సీజన్‌కు ఎన్ఎఫ్ఎస్ఎం, ఎన్ఎంఈఓఓఎస్ పథకాల కింద నూనెగింజలు, పప్పుధాన్యాల విత్తనాల పంపిణీని ప్రారంభించారు.
ప్రాజెక్టుల్లోని నీటి నిల్వల ఆధారంగా పంటల ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్లను, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటలను ప్రోత్సహించాలని, వేరుశనగలో కొత్త విత్తన రకాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల రైతుల విజ్ఞప్తి మేరకు ఇతర పంటలకు సబ్సిడీపై స్ప్రింక్లర్లు అందించే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆయిల్‌పామ్ గెలలను వేగంగా ఫ్యాక్టరీలకు తరలించి రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూస్తామన్నారు. విత్తన రకం, ధర, పథకం నిబంధనల ఆధారంగా 50 నుంచి 75 శాతం వరకు సబ్సిడీ లభించనుండగా, కొన్ని రకాలకు 100 శాతం సబ్సిడీ అందించనున్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల రైతులు పాల్గొన్నారు. ఎల్‌నినో, వాతావరణ పరిస్థితులు, యాసంగి పంటలపై ఐఎండీ, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు.