
చూడటానికి నువ్వు అమ్మాయిలా లేవు.. నీ జుట్టు మహిళ జుట్టులా లేదు. నీ వేషధారణ పురుషుల్లాగా ఉంది.. నీకు జీరో టికెట్ ఇచ్చేది లేదు.. ఫ్రీ జర్నీ కుదరదు.. అంటూ కండక్టర్ యువతికి జీరో టికెట్ ఇచ్చేందుకు నిరాకరించిన ఘటన తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఏకంగా పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ నమోదయ్యేవరకు వెళ్లింది. కేరళలో జరిగిన ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఇంటర్ స్టూడెంట్ కు ప్రియదర్శిని జీరో టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఎర్నాకులంలోని నార్త్ పరవూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. 2026 సెప్టెంబర్ 26 (శనివారం) సాయంత్రం గురవాయూర్ నుంచి ఎర్నాకులం రూట్ లో వెళ్తున్న కేఎస్ఆర్టీసీ ఆర్డినరీ బస్సులో ఈ వివాదం మొదలైంది.
విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఇటీవల పండుగ సందర్భంగా అమ్మాయి గుండు కొట్టించుకుంది. దీంతో ఆమె జుట్టు మెల్లగా పెరుగుతోంది. అయితే జుట్టు అబ్బాయిలకు ఉన్నట్లుగా ఉందని జీరో టికెట్ ఇచ్చేందుకు కండక్టర్ నిరాకరించారు.
టికెట్ ఛార్జీ 15 రూపాయలు ఇవ్వాలని కండక్టర్ డిమాండ్ చేయగా.. ఆమె జీరో టికెట్ కు అర్హురాలని తన స్నేహితురాలు చెప్పింది. దీంతో వాదోపవాదాల తర్వాత టికెట్ ఇచ్చేది లేదు బస్సు దిగమని కండక్టర్ దుర్భాషలాడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కండక్టర్ తో పాటు బస్సులో ఉన్న కొందరు ఆ విద్యార్థిని వేషధారణ చూసి నవ్వారని, బూతులు తిట్టారని పేర్కొంది. కొందరు భౌతికంగా దాడులు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
►ALSO READ | సినిమా ఛేజింగ్ను మించి.. 40 కి.మీ. కారు రూఫ్పైన పోలీస్.. స్మగ్లర్లను పట్టుకున్న తీరుకు హాట్సాఫ్!
దీంతో నార్త్ పరవూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన యువతి.. జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
ఈ కేసు సీఎం వీడీ సతీషన్ దృష్టికి వచ్చిందని.. జీరో టికెట్ నిరాకరించిన కండక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు నార్త్ పరవూర్ మున్సిపల్ ఛైర్ పర్సన్ రమేష్ డి కురుప్ తెలిపారు. ప్రభుత్వం ప్రారంభించిన ప్రియదర్శిని ఉచిత ప్రయాణం స్కీమ్ మహిళలు అందరికీ ఉచితం అని.. ఇలాంటి ఘటనలు జరగటం బాధాకరమని అన్నారు.