
కోపం వచ్చినప్పుడు తలలో నరం చిట్లిపోతుందనే మాట మనం చాలాసార్లు వింటూ ఉంటాం. అయితే నిజానికి కోపం వస్తే ఏం జరుగుతుంది, ఒత్తిడి మన మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా….
మనకు కోపం వచ్చినప్పుడు తలలోని నరం నిజంగానే చిట్లిపోతుందని చెప్పలేం. కానీ, కోపం వల్ల శరీరంలో జరిగే మార్పులు మాత్రం చాలా ప్రమాదకరంగా మారవచ్చు.
తీవ్రమైన కోపం లేదా ఒత్తిడి వచ్చినప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది, రక్తపోటు (బీపీ) ఒక్కసారిగా పెరుగుతుంది, అడ్రినలిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీన్నే “పోరాడటం లేదా పారిపోవడం” (Fight or Flight) అంటారు.
మెదడుపై ప్రభావం
కొంతమందికి మెదడులోని రక్తనాళాలు బలహీనపడి, బెలూన్‌లా చిన్నగా ఉబ్బి ఉంటాయి. దాన్నే బ్రెయిన్ ‘అనూరిజం’ అంటారు.
మనకు తీవ్రమైన కోపం వచ్చినప్పుడు లేదా విపరీతమైన ఒత్తిడికి గురైనప్పుడు బీపీ అకస్మాత్తుగా పెరిగి, ఈ బలహీనమైన రక్తనాళం పై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల అది పగిలిపోయి (Rupture) మెదడులో రక్తస్రావం (Brain Hemorrhage) అయ్యే ప్రమాదం ఉంది. దీన్నే వైద్యపరంగా ‘సబరాక్నాయిడ్ హెమరేజ్’ అంటారు.
►ALSO READ | నెలకు మూడు సార్లు తినండి.. గొంతు నొప్పి ఉండదు.. జలుబు మటు మాయం.. వైరల్ ఇన్ఫెక్షన్ మీ జోలికి రాదు..!
గుర్తించాల్సిన ప్రమాదకర లక్షణాలు
అనూరిజం పగిలినప్పుడు శరీరం కొన్ని హెచ్చరిక సంకేతాలు ఇస్తుంది. వీటిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు:
*అకస్మాత్తుగా భరించలేనంత తీవ్రమైన తలనొప్పి రావడం.
*వాంతులు కావడం లేదా వికారం అనిపించడం.
*మెడ బిగుసుకుపోవడం.
*స్పృహ కోల్పోవడం లేదా కళ్లు తిరగడం.
*ఫిట్స్ (మూర్ఛ) రావడం.
*మాట తడబడటం లేదా శరీరంలో బలం తగ్గడం.
ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి.
దీనిని ఎలా నివారించాలంటే
*బీపీ అదుపులో ఉంచుకోవడం: హై బీపీ ఉన్నవారు బీపీని ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలి.
*సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి లేదా ధూమపానం మానేయాలి.
* యోగా, ధ్యానం (Meditation) లేదా మనకు నచ్చిన పనుల ద్వారా కోపాన్ని, ఒత్తిడిని తగ్గించుకోవడం లేదా కంట్రోల్లో ఉంచుకోవడం మంచిది.