
రంగారెడ్డి: యాచారం మండలం నందివనపర్తి రెవెన్యూ పరిధిలో విలువైన భూమికి సంబంధించిన వివాదంలో తహసీల్దార్, ఉప తహసీల్దార్, భూభారతి సిస్టమ్ ఆపరేటర్ సహా 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ పత్రాలు సృష్టించడం, తప్పుడు ఒప్పందాలు తయారు చేయడం, రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయడం, కోర్టులో తప్పుడు పత్రాలను సమర్పించారనే ఆరోపణలపై కేసు నమోదైంది.
యాచారం మండలం నందివనపర్తి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 361లో 8.29 ఎకరాల భూమి విషయంలో ఈ వివాదం తలెత్తింది. ఈ భూమి విలువ రూ.50 కోట్లకు పైగా ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.ఈ భూమిని నకిలీ పత్రాలు, తప్పుడు ఒప్పందాలు, రెవెన్యూ రికార్డుల్లో మార్పుల ద్వారా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారంటూ ఎండీ నజీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2021 ఆగస్టు 5 తేదీతో నకిలీ Joint Agreement of Sale రూపొందించి, దాని ఆధారంగా మరికొన్ని పత్రాలను సృష్టించారని ఫిర్యాదులో ఆరోపించారు. అనంతరం ఆ పత్రాలను ఇబ్రహీంపట్నం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దాఖలు చేసి O.S.No.547/2021 వ్యవహారంలో ఉపయోగించారని తెలిపారు. మరోవైపు భూ భారతి రికార్డుల్లోనూ అక్రమంగా మార్పులు చేశారనే ఆరోపణలు ఫిర్యాదులో ఉన్నాయి.
ఈ వ్యవహారంలో ప్రైవేట్ వ్యక్తులతో పాటు కొందరు రెవెన్యూ అధికారుల పేర్లు కూడా ఫిర్యాదులో ఉన్నట్లు తెలుస్తోంది. యాచారం తహసీల్దార్ అయ్యప్ప, ఉప తహసీల్దార్ కీర్తిసాగర్, భూభారతి సిస్టమ్ ఆపరేటర్ నర్సింహాచారితో పాటు మరో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.మొత్తం 13 మందిపై BNSలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు సమాచారం.
ఎండీ నజీర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. BNS 318(4), 340(2), 337, 344 r/w 61(2) కింద కేసు నమోదు చేసి పత్రాలు, రెవెన్యూ రికార్డులు, కోర్టులో దాఖలైన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. అయితే ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలు దర్యాప్తులో ఎంతవరకు నిజమో తేలాల్సి ఉంది. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఈ వ్యవహారంలో వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.