
హైదరాబాద్ సిటీలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ కు హోటళ్లు ఉన్నాయంటూ.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్ సిటీలో మూడు హోటళ్లు ఉన్నాయని.. వ్యాపారం చేస్తే తప్పేంటనీ ప్రశ్నించారు కేటీఆర్. 1999లోనే ఒక హోటల్ పెట్టామని.. అది ఇప్పుడు మూడు హోటళ్లు అయ్యాయయని.. వ్యాపారాలు చేయకూడదా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.
రేవంత్ రెడ్డి సిరిసిల్లలో సభ పెడుతున్నదంటే ఆత్మహత్య చేసుకున్న నేతన్నల గురించి మాట్లాడి వారి కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటిస్తాడేమో అనుకుంటే.. అక్కడ కూడా తమపై బురద చల్లడానికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. ఈ మాత్రం సిరిసిల్లకు వెళ్లడం ఎందుకు..? హైదరాబాద్ లోనే సమావేశం పెడితే సరిపోతుందని కదా అని అన్నారు.
ALSO READ : సీనియర్ సిటిజన్స్కు ఉచిత బస్ పాసులు: మంత్రి పొన్నం ప్రభాకర్
మాట మాట్లాడితే నల్లమల పులి అని చెప్పుకుంటున్నారని… నల్లమల పులి అయితే..400 మంది పోలీసుల భద్రతతో.ఆరుగురు మంత్రులు, పీసీసీ చీఫ్ తో కలిసి సిరిసిల్లకు వస్తాడా అని అన్నారు. రేవంత్ నల్లమల పులి కాదు.. చంద్రబాబు దగ్గర పిల్లి అంటూ ఎద్దేవా చేశారు.
కాళేశ్వరంలో లక్ష కోట్లు, ఫార్ములా ఈ కేసు, ఫోన్ ట్యాపింగ్ అంటూ తమను ఇబ్బంది పెట్టేందుకు చాలా ప్రయత్నాలు చేశారు కానీ.. ఏం సాధించలేకపోయారని అన్నారు. ఆనాడు కేసీఆర్ కొత్త సచివాలయం కడుతుంటే రాజమహల్ కడుతున్నారని ఆరోపించారని.. ప్రగతి భవన్ లో 150 బెడ్ రూమ్ లు, బంగారు బాత్ రూమ్ లు అంటూ ఆరోపించారని.. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా.. దమ్ముంటే నిరూపించాలని అన్నారు కేటీఆర్.