
భద్రాద్రి జిల్లాలో సంచలనం రేపిన నర్సింగ్ విద్యార్థిని హరిణి హత్య కేసును ఛేదించారు జూలూరుపాడుపోలీసులు. ఈ కేసుకు సంబంధించి ముమ్మరంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు పవన్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. హరిణి తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతోనే పవన్ ఆమెను హతమార్చినట్లు నిర్దారించారు పోలీసులు. గొంతుకు వైర్ బిగించి కిరాతకంగా చంపేశాడని తెలిపారు పోలీసులు. గురువారం ( అక్టోబర్ 1 ) మీడియాతో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి షాకింగ్ నిజాలు వెల్లడించారు పోలీసులు.
వెంగన్నపాలెం గ్రామానికి చెందిన సతీష్, రాజేశ్వరి దంపతుల కుమార్తె హరిణి, నిందితుడు దేవరకొండ పవన్ కుమార్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారని… పవన్ ఎలాంటి పని చేయకుండా మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్న క్రమంలో హరిణి అతన్ని కొంతకాలంగా దూరం పెట్టిందని తెలిపారు పోలీసులు. ఈ క్రమంలో ఏడాది కాలంగా ఇరు కుటుంబాల మధ్య పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగిందని తెలిపారు.
పవన్ ప్రవర్తన సరిగా లేదని.. తమ కూతురిని ఇచ్చి పెళ్లి చేయలేమని తేల్చి చెప్పారు హరిణి తల్లిదండ్రులు. దీంతో తరచూ హరిణి వెంటపడుతూ వేధించడం స్టార్ట్ చేశాడని తెలిపారు. పవన్ వేధింపులతో విసిగిపోయిన హరిణి, అతడి ఫోన్ నంబర్ సహా ఇంస్టాగ్రామ్ సైతం బ్లాక్ చేసిందని.. తనను దూరం పెడుతోందన్న కోపంతో ఈ పవన్ ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలిపారు పోలీసులు.
సెప్టెంబర్ 22న మధ్యాహ్నం సమయంలో పవన్ హరిణి ఇంటికి వెళ్లి ఆమెతో వాగ్వాదానికి దిగాడని.. తనను ఎందుకు దూరం పెడుతున్నావంటూ నిలదీశాడని తెలిపారు. హరిణి ఎంతకీ అంగీకరించడకపోవడంతో ఆవేశానికి గురైన పవన్ తన వెంట తెచ్చుకున్న బైక్ గేర్ వైర్ తో హరిణి మెడకు బిగించి హత్య చేసి… ఆ తర్వాత హరిణి మృతదేహాన్ని ఇంటి పక్కన మెట్ల పక్కన సందులో పడేసి పరారయ్యాడని తెలిపారు పోలీసులు.
ALSO READ : పైలట్‌పై దాడి.. ఏడాది క్రితం చెప్పిన మాటే నిజమైంది..!
పవన్ తన బైక్ కోసం ఒంటిటిగుడిసె రోడ్డులోని సీతారామ ప్రాజెక్టు కాల్వ దగ్గర ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టి.. అక్కడి నుంచి నేరుగా విశాఖకు పారిపోయాడు. ఆ తర్వాత తిరుపతి వెళ్లిన పవన్ అక్కడి నుంచి ఖమ్మంకు చేరుకున్నాడు. వేరే ఎక్కడికైనా వెళ్లి ర్యాపిడో నడుపుకుందామనే ఉద్దేశంతో తాను దాచిపెట్టిన బైక్ తీసుకునేందుకు జూలూరుపాడు రావడంతో సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.పవన్ అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన బైక్ గేర్ వైర్, రెండు ఫోన్లు, హత్య సమయంలో అతడు ధరించిన టీషర్ట్ ను సీజ్ చేశారు పోలీసులు.