
హైదరాబాద్: సిరిసిల్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేసిన మొనగాడిని మంత్రి వర్గంలోకి తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆనాడు గజ్వేల్ గడీని నేలమట్టం చేస్తామని చెప్పినం.. చేసి చూపించాం. ఈ సారి సిరిసిల్ల గడీల మీద గురిపెడదాం.. ఫిరంగులమై పేలుదాం.. సిరిసిల్ల గడిని నేలమట్టం చేద్దాం.. సిరిసిల్ల గడ్డపై ఇదే నా ప్రతిజ్ఞ అని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు.
బుధవారం (సెప్టెంబర్ 30) సీఎం రేవంత్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ దైవం, ధైర్యం కలిసిన ప్రాంతం సిరిసిల్ల. సిరిసిల్ల అంటే సిరులకు నిలయం. చేనేత కార్మికులకు, వృత్తి నైపుణ్యానికి సిరిసిల్ల పెట్టింది పేరు. అగ్గిపెట్టె చీరతో సిరిసిల్లకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు నేతన్నలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేండ్ల పాలనలో సిరిసిల్ల ఉరిసిల్లగా మారింది. సమస్యలకు నిలయంగా సిరిసిల్లను మార్చేశారు.
2009 అసెంబ్లీ ఎన్నికల్లో మహేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా కేసీఆర్ ఆయన కొడుకు కేటీఆర్‌ను సిరిసిల్ల నుంచి నిలబెట్టాడు. ఆనాడు కేటీఆర్ చావు తప్పి కన్నులొట్టబోయినట్లు సిరిసిల్లలో కేటీఆర్ గెలిచాడు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించింది. కాళేశ్వరం కట్టి కేసీఆర్ లక్ష కోట్లు కొల్లగొట్టారు. మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్ రావు, సంతోష్ రావు, కేటీఆర్ కోట్లు సంపాదించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేరెళ్ల దళితులను ఇసుక లారీలతో తొక్కించింది నిజమా కాదా.. దళిత బిడ్డలను పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టలేదా..?
గల్ఫ్ వలసలను పదేండ్లలో కేసీఆర్ ఎందుకు ఆపలేకపోయారు. గల్ఫ్ లో కార్మికులు చనిపోతే కనీసం వారి మృతదేహాలు స్వస్థలానికి తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించలేదు. పదేండ్లలో ఒక్కరోజు కూడా కేసీఆర్ కుటుంబం గల్ఫ్ బాధితుల గురించి పట్టించుకోలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల సాయం చేస్తున్నాం’’ అని చెప్పారు.
కాళేశ్వరం కట్టి లక్ష కోట్లు కొల్లగొట్టిర్రు:
కేసీఆర్ కుటుంబం తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం కట్టి కేసీఆర్ లక్ష కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. మానేరు ఇసుక కొల్లగొట్టి కేసీఆర్ బంధువులు రవీందర్ రావు, సంతోష్ రావు, కేటీఆర్ కోట్లు సంపాదించారన్నారు.
కేసీఆర్ ఫ్యామిలీ పదేండ్లలో వేల కోట్ల ఆస్తులు సంపాదించి.. వందల ఎకరాల ఫాంహౌస్‌లు నిర్మించుకున్నారని ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమం, సిరిసిల్ల ప్రజల ఓట్లను కేసీఆర్ ఫ్యామిలీ సొమ్ముగా మార్చుకుందన్నారు. వేల కోట్లు సంపాదించి విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని విమర్శించారు. ఎన్ని బాత్ రూములు, చిప్పలు కడిగితే అన్ని కోట్లు వస్తాయని ప్రశ్నించారు.
కరీంనగర్ ప్రజలను మోసం చేసి పాలమూరుకు కేసీఆర్
‘‘కరీంనగర్ ప్రజలు కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకున్నారు. 2024, 2006, 2008లో కేసీఆర్‌ను గెలిపిస్తే కరీంగనర్ ప్రజలను మోసం చేసి పాలమూరు పారిపోయారు. 2009లో పాలమూరు ప్రజలు పార్లమెంటుకు పంపిస్తే.. తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలమూరు ప్రజలను మోసం చేసి గజ్వేల్ వెళ్లిపోయిండు. కరీంనగర్ ప్రజలు మానేరులో పాతిపెడతారనే కేసీఆర్ పాలమూరు పారిపోయిండు’’ అని సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.