
CM Chandrababu: ఇవాళ సీఎం చంద్రబాబు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పర్యటించనున్నారు. లక్ష కోట్ల అంచనా వ్యయంతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హాజరుకానున్నారు. విత్తనం నాటే స్థాయి నుంచి విదేశాలకు పంట ఉత్పత్తుల ఎగుమతి వరకు రైతులకు పూర్తి అండగా నిలవనుంది ప్రభుత్వం. 10 జిల్లాల పరిధిలోని 201 క్లస్టర్లలో సమగ్ర అభివృద్ధి పనులను చేపట్టనుంది. మూడు దశల్లో లక్ష కోట్ల భారీ వ్యయంతో ఈ హబ్ ఆవిష్కృతం కానుంది. ఇందులో ప్రభుత్వం 40వేల 352 కోట్లు సమకూరుస్తోంది. ప్రైవేట్ రంగం ద్వారా మరో 60వేల కోట్ల పెట్టుబడులు సమీకరించేలా ప్రణాళికలు రూపొందించారు. రాయలసీమను దేశంలోనే అగ్రగామి ‘ఫ్రూట్ బౌల్’గా మార్చేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రణాళికను సిద్ధంచేసింది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు లక్ష కోట్లతో రాయలసీమ రైజింగ్ పేరిట బృహత్ ప్రణాళికను రూపొందించాయి. ఆయా జిల్లాల్లో మౌలిక వసతుల కల్పనకు 40వేల 352 కోట్లు వెచ్చించనున్నాయి. ప్రైవేట్ రంగం నుంచి మరో 60వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఉద్యాన పంటల ఉత్పత్తి నుంచి పంటకోత, గ్రేడింగ్, ప్యాకింగ్, కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్, ఉత్పత్తులకు బ్రాండింగ్, రవాణా.. దేశీయ, అంతర్జాతీయ మార్కెటింగ్‌ల వరకు అన్నిరకాల సౌకర్యాలు సమకూరనున్నాయి. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలోనే, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం రిలయన్స్ సంస్థతో కలిసి ఈ విద్యా, పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పుతోంది.