
భద్రాచలం, వెలుగు : ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న సుమారు 1.82 కోట్ల విలువైన గంజాయిని ఖమ్మం జిల్లా భద్రాచలం డీటీఎఫ్, ఎక్సైజ్ ఆఫీసర్లు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… డీటీఎఫ్ కొత్తగూడెం టీం ఆధ్వర్యంలో బుధవారం భద్రాచలం వీరభద్ర ఫంక్షన్ హాల్ సమీపంలో హహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో బైక్ పై వస్తున్న ఒడిశాకు చెందిన దివారక్ మండల్ ను ఆపి తనిఖీ చేయగా తొమ్మిది కిలోల గంజాయి దొరికింది.
తర్వాత అటు వైపు వచ్చిన హ్యుందాయ్ కారును ఆపి తనిఖీలు చేపట్టగా.. 100 కిలోల గంజాయి దొరకడంతో ఒడిశాకు చెందిన సుమన్ పాల్ ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత దివాకర్, సుమన్ ఇచ్చిన సమాచారంతో కరుణగిరి వద్ద ఆగి ఉన్న ఓ లారీని తనిఖీ చేయగా.. అందులో 263.2 కేజీల గంజాయి దొరికింది. దీంతో రాజశేఖర్ మార్గి, బ్రిజన్ నాసాను అదుపులోకి తీసుకున్నారు.
మొత్తం రూ. 1.82 కోట్ల విలువైన 365 కిలోలగంజాయిని స్వాధీనం చేసుకొని, నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. కొత్తగూడెం డీటీహెచ్ సీఐలు రమాదేవి, కిష్టయ్య, నరేందర్ రెడ్డి, ఎస్సై సలీముల్లా ఖాన్, శ్రీధర్ రావు, సిబ్బంది కరీం, మౌలాంకర్, వీరబాబు, శ్రీనివాస్, నర్సింహరావు, రమేశ్ పాల్గొన్నారు.