కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త అందించింది. ఉద్యోగుల భవిష్య నిధి (EPF0) గరిష్ట వేతన పరిమితిని రూ.15,000 నుండి రూ.25,000కు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన ఈ ప్రతిపాదన వల్ల.. దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఈ మార్పు ఉద్యోగుల వేతన నిర్మాణం, పీఎఫ్ వాటా, పెన్షన్ అర్హతలపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది.
చాలా కాలంగా కార్మిక సంఘాలు ఈపీఎఫ్ వేతన పరిమితిని పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. 2014లో చివరిసారిగా రూ.6,500 నుండి రూ.15,000కు పెంచారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రూ.25,000కు పెంచారు. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే 2014లో రూ.15,000 విలువ ఇప్పుడు రూ.32,000కు సమానం అని నిపుణులు చెబుతున్నారు. ఈ పెంపువల్ల ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఉద్యోగులు, యాజమాన్యం వాటా పెరగడం వల్ల పీఎఫ్ ఖాతాలో ఎక్కువ మొత్తం నిధులు జమ అవుతాయి. గతంలో రూ.15,000 శాలరీపై ఉద్యోగి రూ.1,800, యాజమాన్యం రూ.1,800 చెల్లించేవారు. ఇప్పుడు రూ.25,000పై ఉద్యోగి రూ.3,000, యాజమాన్యం రూ.3,000 చెల్లిస్తారు.
ఉద్యోగులకు పీఎఫ్ కార్పస్‌ను గణనీయంగా పెరగనుంది. యాజమాన్యం వాటాలో కొంత మొత్తం ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) లోకి వెళ్తుంది. పెరిగిన వేతన పరిమితి వల్ల ఈపీఎస్ ఖాతాలోకి ఎక్కువ డబ్బు వెళ్లనుంది. దీని వల్ల పదవీ విరమణ తర్వాత వచ్చే పెన్షన్ మొత్తం పెరిగే అవకాశం ఉంది. ఇక ఈడీఎల్ఐ (Employee Deposit Linked Insurance) పథకం కింద జీవిత బీమా ప్రయోజనం కూడా ఎక్కువమంది ఉద్యోగులు కలగనుంది.
అయితే కంపెనీ పెన్షన్ కాంట్రిబ్యూషన్ మీకు చెల్లించకపోతే ఫిర్యాదు చేసే అవకాశముంది. ముందుగా కంపెనీ హెచ్ఆర్, మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లాలి. కంపెనీ స్పందించకపోతే EPFiGMS పోర్టల్‌లో ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. తమ UAN నెంబర్, పీఎఫ్ అకౌంట్ ఉపయోగించి ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. అనంతరం రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. దీని ద్వారా మీ ఫిర్యాదు స్థితిని కూడా తనిఖీ చేసుకోవచ్చు.




