
OTR: ఆంధ్రప్రదేశ్‌లో మెజార్టీ కూటమి ఎమ్మెల్యేలు డేంజర్ జోన్‌లో ఉన్నారా? నియోజకవర్గాల్లో వాళ్ళ మీద తీవ్ర అసంతృప్తి పెల్లుబుకుతోందా? కొందరికైతే… అసలు ఎప్పుడూ రెడ్ బల్బ్ వెలుగుతూనే ఉందా? సీఎం చంద్రబాబు కూడా నివేదికలకు అనుగుణంగానే… కొందరి మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? ఎందరు శాసనసభ్యులు ఇప్పుడా జోన్‌లో ఉన్నారు? వాళ్ళ గురించి కూటమిలో జరుగుతున్న చర్చ ఏంటి?/ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎమ్మెల్యేల తీరుపై విపరీతంగా చర్చ జరుగుతోంది. స్వయంగా సీఎం చంద్రబాబే..చాలా సందర్భాల్లో వాళ్ళ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో తాజాగా వెలువడుతున్న వివిధ సర్వే ఫలితాలు కూడా కూటమి పెద్దల్ని కంగారు పెడుతున్నాయట. 95 మంది సిట్టింగ్ శాసనసభ్యులు డేంజర్ జోన్‌లో ఉన్నారన్న నివేదికలే అందుకు కారణం అంటున్నారు. దీని గురించి పైకి ఎంత గంభీరంగా మాట్లాడినా… లోలోపల మాత్రం ఆందోళన పెరుగుతోందంటున్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. అయితే…వచ్చే ఎన్నికల కోసం కూటమి- వైసీపీ ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. అదే సమయంలో ఇప్పుడు స్థానిక ఎన్నికల్ని కూడా రెండు పక్షాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అయితే… అధికార పక్షంగా ఫలితాల్లో పూర్తి స్థాయి డామినేషన్ కోసం కూటమి ప్రభుత్వం వరుసగా నిర్ణయాలు తీసుకుంటోంది.ఇక.. పలు సర్వే సంస్థలు క్షేత్ర స్థాయిలో పబ్లిక్ మూడ్ గురించి చెబుతున్నాయి.
ఎవరేం చెప్పినా అందరిలో ఒక కామన్ పాయింట్ ఏంటంటే… ఎమ్మెల్యేల మీద పెరుగుతున్న వ్యతిరేకత. ఇదే ఇప్పుడు కూటమి పార్టీల్లో అంతర్గతంగా టెన్షన్ పెంచుతోందట. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పలువురు ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. తమ నియోజకవర్గాలను సామంత రాజ్యాలుగా చేసుకొని ప్రతీ పనిలోనూ కమీషన్లు దండుకుంటున్నారని, సంపాదనే లక్ష్యంగా అవినీతికి పాల్పడుతున్నారనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. అవినీతిని సహించబోమని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తీరు మార్చుకోకుంటే వేటు ఖాయమని పై స్థాయిలో హెచ్చరిస్తున్నా… కొందరు ఎమ్మెల్యేలకు అవేమీ చెవికెక్కడం లేదట. ఆ…. వాళ్లు అలాగే చెబుతుంటారులే… అవన్నీ జరిగినప్పుడు చూద్దామనుకుంటూ….వ్యవహారాలు చక్కబెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. మొదట్లో పదుల సంఖ్యలో ఉన్న ఇలాంటి నియోజకవర్గాల సంఖ్య ఇప్పుడు 90 దాటేసిందన్న నివేదికలు కూటమి పెద్దల్ని కంగారు పెడుతున్నాయట. అదే సమయంలో స్వయంగా…. సీఎం చంద్రబాబు సైతం 50 మందికిపైగా ఎమ్మెల్యేల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేయడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. తాజాగా విడుదలైన ఓ సర్వే కూడా ఇదే విషయాన్ని కన్ఫామ్ చేయడం కలకలం రేపుతోంది. ఆ సర్వేలో… వోవరాల్‌గా కూటమికి సానుకూలత కనిపించినా… ఎక్కడికక్కడ ఎమ్మెల్యేల మీద పెరుగుతున్న వ్యతిరేకత మాత్రం వార్నింగ్ బెల్లేనని అంటున్నారు. ఏకంగా 95 మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్‌లో ఉన్నారన్న వివరాలు కలకలం రేపుతున్నాయి.
అవినీతి, అక్రమాల కారణంగానే వారి మీద వ్యతిరేకత పెరిగిందన్న విశ్లేషణ ఇంకా భయపెడుతోందట. ప్రభుత్వం మీద సానుకూలత ఉన్నా.. క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేల కారణంగా కూటమి నష్టపోతోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇది ఇలాగే కొనసాగితే… వచ్చే ఎన్నికల్లో మెజార్టీ అభ్యర్థుల్ని మార్చక తప్పదన్న చర్చ కూడా జరుగుతోందట కూటమి వర్గాల్లో. గత ఎన్నికల్లో కూటమికి ఏకంగా 164 స్థానాలు రాగా…. ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల నుంచే కొందరు ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు మొదలయ్యాయి. అయితే… వచ్చే ఎన్నికల్లో వీరిని మార్చి కొత్త వారికి అవకాశం ఇచ్చినా…. ఆ గెలిచే వాళ్ళు కూడా అదే తరహాలో చేయరనే గ్యారంటీ ఏంటన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇప్పుడున్న వాళ్ళని కంట్రోల్ చేయలేని వారు.. అప్పుడు వాళ్ళని చేయగలుగుతారా అనేది కామన్‌మేన్ క్వశ్చన్. అవినీతి మరకల పేరుతో రేపు ఎన్నికల్లో ప్రస్తుత సిట్టింగ్స్‌ని తప్పిస్తే…కొత్త వారికి వీళ్ళ సహకారం ఉండదని, అది మరో సమస్యకు దారి తీస్తుందని కూడా అంటున్నారు. అందుకే… ఇంకా రెండున్నరేళ్ళ సమయం ఉంది కాబట్టి… ఆలోపు ఇప్పుడున్న వాళ్ళనే నయానో భయానో సెట్ చేస్తేనే…కూటమి పరిస్థితి మెరుగుపడుతుందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మొత్తం మీద మెజార్టీ ఎమ్మెల్యేలు డేంజర్ జోన్‌లో ఉన్నారన్న క్లారిటీ వచ్చింది కాబట్టి మూడు పార్టీల అధిష్టానాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయోనని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయవర్గాలు.